తగ్గేదే లే.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన పుతిన్, భగ్గుమన్న అమెరికా
Send us your feedback to audioarticles@vaarta.com
పశ్చిమ దేశాలు హెచ్చరిస్తున్నా.. నాటో దళాలు నలువైపులా మోహరించినా ఏమాత్రం తగ్గేదే లే అంటూ యుద్ధానికి సై అన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఉక్రెయిన్‌పై సైనిక చర్య జరపాల్సిందిగా సైన్యాన్ని ఆయన ఆదేశించారు. ఇతర దేశాలు ఈ సైనిక చర్యను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. తూర్పు ఉక్రెయిన్‌లోని ప్రజలను కాపాడేందుకు ఈ సైనిక చర్య అత్యవసరమన్నారు.
తూర్పు ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. దొనెట్స్క్ ప్రాంతంలో ఉన్న క్రమాటోర్క్స్‌లో పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో కూడా ఐదు భారీ పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. కీవ్, ఖర్కీవ్, ఒడిసా, తూర్పు దొనెట్స్క్ ప్రాంతంలో పేలుళ్లు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది.
మరోవైపు.. పుతిన్ యుద్ధ ప్రకటనపై అమెరికా అధ్యక్షడు జో బైడెన్ స్పందించారు. ఉక్రెయిన్ నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు లేకపోయినా.. అకారణంగా రష్యా దాడులకు దిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైట్‌హౌస్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని బైడెన్ పేర్కొన్నారు. దీంతోపాటు గురువారం ఉదయం జీ-7 నేతలతో సమావేశం తర్వాత రష్యాపై తీసుకోబోయే చర్యలను వివరిస్తానని చెప్పారు. నాటో కూటమి వైపు నుంచి ప్రతిస్పందన ఉంటుందని జో బైడెన్ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ ప్రకటన నేపథ్యంలో తాజా పరిణామాలతో ఐక్యరాజ్య సమితి అత్యవసరంగా సమావేశమైంది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆటోనియో గుటెర్రస్ దీనిపై స్పందిస్తూ శాంతికి ఒక్క అవకాశం ఇవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout