రష్యా - ఉక్రెయిన్ యుద్ధం : కాస్త శాంతించిన పుతిన్.. తాత్కాలికంగా కాల్పుల విరమణ

  • IndiaGlitz, [Saturday,March 05 2022]

ఉక్రెయిన్ స్వాధీనమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు ఆయనను నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆంక్షలు విధిస్తున్నా.. స్విఫ్ట్ వంటి వేదికల నుంచి వెలివేస్తున్నా పుతిన్ ఆగడం లేదు. భీకరదాడులతో ఉక్రెయిన్ వాసులు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యూరప్‌కు వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో రష్యా స్వల్పంగా శాంతించింది. తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటిస్తూ.. పౌరులను తరలించేందుకు అవకాశం కల్పించింది.

ఉక్రెయిన్‌లోని మరియుపొల్, వోల్నవోఖ్‌ నగరాల్లో పౌరులను సురక్షితంగా తరలించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రష్యా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటల నుంచి తమ దళాలు కాల్పులను నిలిపేస్తాయని పేర్కొంది. కాగా.. వోల్నవోఖ్‌, మరియుపోల్‌ను రష్యా సేనలు ఇప్పటికే ముట్టడించాయి. అయితే అంతర్జాతీయ సమాజం నుంచి వస్తోన్న ఒత్తిడి కారణంగా రష్యా ఈ కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. భీకర యుద్ధం కారణంగా ఉక్రెయిన్ స్మశానాన్ని తలపిస్తోంది. ఎటు చూసినా రక్తపు మడుగులు, కాలిపోయిన శవాలు, భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. షెల్స్, బాంబులతో ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది యూరప్ దేశాలకు వలసవెళ్లగా.. ఇంకొందరు ఉక్రెనియన్లు దేశం కోసం ఆయుధాలు పట్టి పోరాడుతున్నారు. ఇకపోతే.. యూరప్‌లోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రమైన జెపోరోజియాపై రష్యా దాడి చేసింది. ఈ దాడులతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.