పవన్‌కి కేంద్ర మంత్రి పదవి.. పార్టీ పరిస్థితేంటో..!?
- IndiaGlitz, [Thursday,August 27 2020]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్‌పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అయితే చాలా పెద్ద మొత్తంలో ఓట్లను ప్రభావితం చేయగలిగింది. టీడీపీ ఘోర పరాజయం వెనుక జనసేన పాత్ర అంతో ఇంతో ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నికల్లో వైసీపీ బలమైన పార్టీగా అవతరించింది. టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. ఇటీవలి కాలంలో కొందరు టీడీపీ నేతలు కూడా వైసీపీ వైపు చూస్తున్నారు. దీంతో టీడీపీ మరింత బలహీన పడింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బీజేపీతో చెయ్యి కలిపారు.
బీజేపీ, జనసేన ఏకమై టీడీపీ వీక్ అవడంతో ఏర్పడిన వ్యాక్యూమ్‌ని భర్తీ చేయాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పుకారు కూడా హల్‌చల్ చేస్తోంది. అది పవన్‌కి కేంద్ర మంత్రి పదవి దక్కబోతోందని.. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల ఓ కార్యక్రమంలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్, మోదీ ఇద్దరి ఆలోచనల్లో సారూప్యత ఉందని... పవన్‌తో తమది బలమైన దోస్తీ అని పేర్కొన్నారు. ఆయనకి కేంద్రంలో మంచి స్థానం ఇస్తామా, లేక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామా అనేది బయటికి చెప్పబోమన్నారు. తమ పార్టీ పెద్దలు చెప్పిందాన్ని ఫాలో అవుతామని సోము వీర్రాజు వెల్లడించారు. దీంతో పవన్‌కు కేంద్ర మంత్రి పదవి దక్కబోతోందని పుకారు ప్రారంభమైంది.
ఒకవేళ పవన్‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తే మాత్రం జనసేనను బీజేపీలో విలీనం చేయాల్సి రావొచ్చు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పట్లో అది నచ్చక పవన్ ఆయనతో విభేదించి కొంతకాలం పాటు దూరంగా ఉన్నారని వార్తలొచ్చాయి. అలాంటి పవన్ ఇప్పుడు తన పార్టీని విలీనం చేసే ప్రసక్తే ఉండదని అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పటి వరకైతే పవన్‌కు అలాంటి ఆలోచన అయితే ఉన్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..