అగ్ర కథానాయకుల్లో నందమూరి బాలకృష్ణ స్టైలే వేరు. ఏడాదికి ఒకట్రెండు సినిమాలు చేస్తూ యువ కథానాయకులు అపసోపాలు పడుతుంటే సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. ఏకధాటిగా సినిమాలు మీద సినిమాలు చేస్తున్నారు. అభిమానులను, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సినిమాలు చేయడంలో బాలకృష్ణ ముందుంటారు. ఆ కోవలో బాలకృష్ణ చేసిన చిత్రం `రూలర్`. `జైసింహా` తర్వాత సి.కల్యాణ్, కె.ఎస్.రవికుమార్‌లతో బాలకృష్ణ చేసిన చిత్రమిది. అసలు రూలర్ ద్వారా బాలకృష్ణ ఏం చెప్పారు? రూలర్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా కథలోకి వెళదాం..
కథ:
సరోజినీ(జయసుధ) ఓ పెద్ద ఐటీ కంపెనీకి చైర్మన్. ఓ సందర్భంలో ఆమెకు అర్జున్ ప్రసాద్(బాలకృష్ణ) కనపడతాడు. అర్జున్‌కి గతం ఏదీ గుర్తుండదు. దాంతో సరోజినీ అర్జున్‌ని స్వంత కొడుకులా పెంచి పెద్ద చేస్తుంది. అమెరికాకు పంపి ఐటీ రంగంలో నిష్ణాతుణ్ణి చేస్తుంది. అర్జున్ కూడా తమ కంపెనీని నెంబర్ వన్ కంపెనీగా నిలబెడతాడు. ఉత్తర ప్రదేశ్‌లో తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఓ ప్రాజెక్ట్ సరోజినీ కంపెనీకి వస్తుంది. ఆ ప్రాజెక్ట్ వద్దని సరోజినీ చెబుతుంది. అందుకు కారణంగా ఆ ప్రాంతానికి చెందిన మంత్రి భవానీ నాథ్(పరాన్ త్యాగి) తనను ఈ ప్రాజెక్ట్ విషయంలో అవమానించాడని చెబుతుంది. తల్లికి అవమానం జరిగిన చోటే ప్రాజెక్ట్‌ను సక్సెస్ చేయాలని భవానీనాథ్ మనుషులకు ఎదురు తిరగాలని భావించి ఉత్తరప్రదేశ్ వెళతాడు. అక్కడకు వెళ్లిన అర్జున్‌ప్రసాద్‌ని అందరూ ధర్మ అని పిలుస్తుంటారు. ఇంతకు ధర్మ ఎవరు? ధర్మకు, అర్జున్‌కి ఉన్న రిలేషన్ ఏంటి? ధర్మకు భవానీకి ఉండే గొడవేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
ఈ సినిమా కథంతా బాలకృష్ణ ఆధారంగానే రన్ అవుతుంది. ఆయనే సినిమానంతంటినీ మోశాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీని బేస్ చేసుకుని రెండు షేడ్స్‌లో పరుచూరి మురళి రాసుకున్న కథే ఇది. బాలయ్య అభిమానులను, మాస్ ప్రేక్షకులకు నచ్చేలా బాలయ్య పాత్రను డిజైన్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జైసింహాలో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువైంది. దానికి భిన్నంగా మాస్ ఎలిమెంట్స్‌తో రూలర్ సినిమాను సిద్ధం చేశారు. బాలకృష్ణ గతం మరిచిపోవడం, ఐటీ అధినేతగా మారడం అనే అంశాలతో సినిమా స్టార్ట్ అవుతుంది. అలాగే సోనాల్ చౌహాన్ గ్లామర్, సాంగ్స్‌తో ఫస్టాఫ్ సాఫీగా సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్‌లో అసలు ట్విస్ట్‌తో సినిమా టర్న్ అవుతుంది. వేదిక ఎంట్రీ, ఉత్తరప్రదేశ్‌లో తెలుగువారు ఉండే ప్రాంతం, రైతుల సమస్యలతో సినిమాలో సాగుతుంది. బాలయ్య తనదైన స్టైల్లో మాస్ డైలాగ్స్‌ను మాస్‌గా చెప్పారు. యాక్షన్ ఎలిమెంట్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే కుటుంబ కథా ప్రేక్షకులకు సినిమా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయిన తర్వాత భారీ ఫైట్‌తో క్లైమాక్స్‌ను ముగించారు. బాలకృష్ణ ఇలాంటి మూసకథలతో చాలా సినిమాలే చేశారు. హీరోని, హీరోయిజాన్ని మరో రేంజ్‌లో చూపించే రవికుమార్ ఈ సినిమాలో ఆమార్కులో సినిమాను చూపించలేకపోయాడు. వేదిక, సోనాల్ గ్లామర్ పాటలకు పరిమితమైంది. ఇక ప్రకాష్‌రాజ్, భూమిక, నాగినీడు, రఘుబాబు, సప్తగిరి, ధన్‌రాజ్ తదితరులు వారి వారి పాత్రల పరిధి మేర చక్కగానటించారు. చిరంతన్ భట్ సంగీతం ఓకే, నేపథ్యం సంగీతం కథకు తగ్గట్టు ఉంది. రాంప్రసాద్ కెమెరా పనితనం బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
చివరగా... రూలర్.. రొటీన్, బోరింగ్ మాస్ మసాలా
Comments