30 వసంతాల 'రుద్రవీణ'
Send us your feedback to audioarticles@vaarta.com
“పదుగురి సౌఖ్యాన్ని మించిన పండగ లేద”ని చాటి చెప్పిన చిత్రం రుద్రవీణ`. రామాపురంలో సంగీతం నేపథ్యం కలిగిన సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబం బిళహరి గణపతిశాస్త్రిది. ఆయన రెండో కుమారుడు సూర్యం (సూర్యనారాయణ శాస్త్రి). తండ్రి నీడలో పెరిగే సూర్యానికి సంగీతం, వేదాలు తప్ప ఇంకేమీ తెలీదు. ఒక సందర్భంలో దేవుడు మనిషికి రెండు చేతులిచ్చింది.. ఒకటి తనకోసం, మరోటి పరోపకారం కోసం అని తెలుసుకుంటాడు. అప్పటినుంచి అంచెలంచెలుగా మారుతూ.. చివరకు తాగుడే అన్నీ నేరాలకు మూలం అని తెలుసుకుని.. దాన్ని ఆ ఊరి నుంచి తరిమేయాలనే క్రమంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి.. ఆఖరికి కన్న తండ్రిని, కుటుంబాన్ని, ప్రేమించిన అమ్మాయిని, చివరకు తన జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఆ ఊళ్లో ఎవరూ తాగకుండా.. వాళ్ల మార్పుకి కారణం అవుతాడు సూర్యం.
అంతేకాదు.. ఆ ఊళ్లో ప్రభుత్వం చేపట్టాల్సిన పథకాలను ఆ గ్రామ ప్రజలే తమకు తాముగా ఏర్పాటు చేసుకోవడంతో.. చుట్టు పక్కల మరికొన్ని గ్రామాలకు కూడా రామాపురం ఆదర్శమవుతుంది. ఇలా మానవత్వపు విలువలతో పదిమంది సుఖమే తన సుఖం అని నమ్మే సూర్యం కథే ఈ సినిమా. ఇందులో సూర్యంగా చిరంజీవి నటన అద్భుతమనే చెప్పాలి. మిగిలిన పాత్రల్లో జెమినీ గణేషన్, శోభన, ప్రసాద్ బాబు, రమేష్ అరవింద్, పి.ఎల్.నారాయణ తదితరులు నటించారు. ఇళయరాజా సంగీతంలోని అన్ని పాటలు ప్రజాదరణ పొందాయి. ఈ పాటలకు సిరివెన్నెల సాహిత్యం మరింత అందం తెచ్చింది. అలాగే ఆ పాటల్లో ప్రకృతి, మానవత్వం తాలుకు ఛాయలు ప్రతిబింబిస్తుంటాయి. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మూడు జాతీయ, నాలుగు నంది అవార్డులతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకుంది. ఇదే సినిమాని కమల్ హాసన్‌తో తమిళంలో రూపొందించారు. మార్చి 4, 1988న విడుదలైన రుద్రవీణ` నేటితో 30 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout