రుద్రమదేవి మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
రుద్రమదేవి..తెలుగు జాతి చరిత్రను, సంస్కృతిని దేశవిదేశీయులకు తెలియజేసిన గొప్ప సామ్రాజ్ఞి. కాకతీయవంశానికి చెందిన వీరనారి రుద్రమ. పాఠశాలల్లోనూ విద్యార్థులు చదువుకునేంత గొప్ప స్ఫూర్తిమంతమైన ఆమె కథను వెండితెరపై ఆవిష్కరించాలని ఉందని గుణశేఖర్ తన అభిలాషను వ్యక్తం చేసినప్పుడు యావత్ తెలుగుజాతి ఆయనవైపు తిరిగిచూసింది. సెట్స్ వేయడంలో గుణశేఖర్ తర్వాతే ఎవరైనా అనే టాక్ ఎలానూ ఉంది. మామూలు సినిమాకే సెట్స్ తో అదరగొట్టే గుణశేఖర్, భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ త్రీడీ చిత్రంగా తెరకెక్కించే ఈ సినిమా కోసం ఎలాంటి సెట్స్ వేస్తాడోనని కుతూహలం మొదలైంది. బాహుబలిలో విజువల్ ట్రీట్‌ను ఆస్వాదించినవారు గుణశేఖర్ వడ్డించబోయే విజువల్ గ్రాండియర్ కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూడసాగారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్. రెండున్నరేళ్ళు కష్టపడి తెరకెక్కించిన చిత్రం. విడుదలకు ముందు అనేక అడ్డంకులను దాటింది. మరి ఇన్ని సవాళ్ళను ఎదుర్కొన్న ఈ సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొందా అని తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళదాం...
కథ
మార్కొపొలో తన దేశస్థులకు రుద్రమదేవి కథను చెప్పడంతో అసలు సినిమాలోకి ఎంట్రీ అవుతాం. మార్కోపోలో పాత్రకు వాయిస్ ఓవర్ చెప్పింది మెగాస్టార్ చిరంజీవిగారు. కాకతీయరాజైన గణపతి దేవుడు(కృష్ణంరాజు)కికొడుకు పుట్టాలని రాజ్యంలో ప్రజలందరూ ఎదురుచూస్తుంటారు. కానీ వారసుడు రాకూడ&zwzwnj;దని దేవగిరి రాజు(రాజా మురాద్), అతని మనవడు మహాదేవుడు, గణపతి దేవుని దాయాదులైన హరి హరదేవుడు(సుమన్), మురారి దేవుడు(ఆదిత్యమీనన్)లు ఎదురుచూస్తుంటారు. గణపతి దేవుడుకు కుమార్తె పుడుతుంది. ప్రజల్లో నమ్మకం కలగాలంటే పుట్టింది మగపిల్లాడేనని ప్రజలకు చెప్పాలని నిర్ణయించుకుంటాడు రాజగురువు శివదేవయ్య(ప్రకాష్ రాజ్). ఆ విషయాన్నే గణపతిదేవుడికి చెప్పి ఒప్పిస్తాడు. ప్రజలకు పుట్టిన బిడ్డ రుద్రదేవుడు (అనుష్క) అని పరిచయం చేస్తారు. అప్పటి నుంచి ఆ బిడ్డకు 14 ఏళ్ళు వచ్చేదాకా అడవుల్లో పెంచుతారు. సకల విద్యలనూ నేర్పుతారు. అయితే ఆ బిడ్డకు స్త్రీ, పురుష భేదాన్ని మాత్రం తెలుపరు. ఓ సందర్భంలో చాళుక్యవీరభద్రుడితో ఓరుగల్లు అందాలను తిలకించడానికి వెళ్ళిన ఆ 14 ఏళ్ళ ప్రాయపు చిన్నారికి తాను స్త్రీ అనే విషయం బోధపడుతుంది. అయినా తండ్రి, గురువు ఆకాంక్షను నెరవేర్చడానికోసం తాను స్త్రీననే విషయాన్ని మరో పదేళ్ళ పాటు దాచిపెడుతుంది రుద్రమ. అయితే ఓ సందర్భంలో అంతఃపుర స్త్రీలు కౌముది ఉత్సవంలో పాల్గొనడాన్ని గమనించి ఎవరికీ తెలియకుండా తానుకూడా స్త్రీగా ముస్తాబు చేసుకుని రహస్య ద్వారం ద్వారా బయటకు వెళ్ళి జలకాలాడుతుంది. ఆ సమయంలో ఆమెను చాళుక్య వీరభద్రుడు చూసి ప్రేమిస్తాడు. ఈ భామ, తమ యువరాజు ఒక్కరేననే సంగతి అతనికి తెలియదు. అది ఎప్పుడు తెలిసింది? గోనగన్నారెడ్డికి, రుద్రమదేవికి సంబంధం ఏమిటి? గోనగన్నారెడ్డి రెబలిస్ట్ గా ఎందుకు మారుతాడు? మహదేవ పంతం నెరవేరిందా? దాయాదుల పోరును రుద్రమ ఎలా అణిచిపెట్టింది? అనామిక ఎవరు? ఆమెకూ, గోనగన్నారెడ్డికి సంబంధం ఏమిటి? రుద్రమ తన రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటుంది? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్
సినిమా అంతా రుద్రమదేవి జీవితచరిత్రను ఆధారంగా చేసుకుని ఆమె చుట్టూనే తిరుగుతుంది కనుక టైటిల్ పాత్రలో అనుష్క చక్కగా అలరించింది. రుద్రమదేవిగా చక్కని నటనను కనపరిచింది. అటు పురుషుడి పాత్రలోనూ, ఇటు స్త్రీ పాత్రలోనూ చక్కగా నటించింది. అనుష్క కు డబ్బింగ్ బాగా చెప్పింది. యాక్షన్ సన్నివేశాల్లో బాగా కష్టపడి చేసింది. గోనగన్నారెడ్డి పాత్రలో బన్ని ఆదరగొట్టాడు. తెలంగాణ యాసలో చక్కని డైలాగ్స్ చెప్పాడు. సినిమాలో తన ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది. బన్నిలుక్, ఊరకుండవో..,అనే మేనరిజమ్, నా మొలతాడులో తాయెత్తు..ఇలాంటి డైలాగ్స్‌ను పలికిన విధానం చాలా బావుంది. గుణశేఖర్ రుద్రమదేవి చరిత్ర కోసం చాలా వర్కవుట్ చేశాడు. దాదాపు తొమ్మిదేళ్ళ కష్టం తెరపై కనపడింది. సినిమాని ప్యాషనేట్ గా చేయడమంటే మాటలు కాదు. అందుకు గుణశేఖర్‌ను అభినందించాల్సిందే.రాజసింహ రాసిన తెలంగాణ యాస డైలాగ్స్ చాలా బావున్నాయి. తనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది.
బన్ని, డైలాగ్ డెలివరీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని చేశారు. అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బావుంది. అక్కడక్కడా చిన్న డిఫెక్ట్స్ మినహా బాగా ఉంటుంది. ఇళయరాజా సంగీతంలో ట్యూన్లు బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బాగా ఉంటే బావుండేది. తోట తరణి ఆర్ట్ వర్క్ సూపర్. నీతాలూల్లా కాస్ట్యూమ్స్ డిజైనింగ్ బావుంది. సుమన్, కృష్ణంరాజు, ఆదిత్యమీనన్, అజయ్ సహా ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.
మైనస్ పాయింట్స్
రుద్రమదేవి క్యారెక్టర్ ను మగపాత్రలో చూపించడం బాగానే ఉంది కానీ ఫస్టాఫ్ అంతా అలాగే కంటిన్యూ చేయడం సరికాదు. ఎప్పుడో సెకండాఫ్ వరకు దాన్ని బేస్ చేసుకుని సినిమాని సాగదీసినట్టు అనిపించింది. 16ఏళ్ళకే మహిళా అవయవసౌష్టవం బయటపడుతుంది. అలాంటప్పుడు దాన్ని దాచి పురుషుడిలా తిప్పడం అంటే మాటలు కాదు. ఆ లాజిక్‌ను కాస్త ఆలోచిస్తే బావుండేది. రోప్ వర్క్ తెలిసిపోతుంది. హార్స్ రైడింగ్ వంటి విషయాల్లో గుణశేఖర్ మరింత కేర్ తీసుకుని ఉండాల్సింది. రానా క్యారెక్టర్ మరీ చిన్నదిగా కనిపించింది. ఐటెమ్ సాంగ్ ఆడియోలో వినిపించింది. ఆ తర్వాత యూట్యూబ్ లో పాటను కూడా విడుదల చేశారు. నిడివి ఎక్కువవుతుందని అనుకున్నరేమో సినిమాలో పెట్టలేదు. గ్రాఫిక్ వర్క్ పెద్దగా ఆకట్టుకోలేదు. పస్టాఫ్ ఎడిటింగ్ బావుంది. సెకండాఫ్ ఎడిటింగ్ బాగా లేదు. సన్నివేశాల్లో ఎక్కడా బలం కనపడదు. ఇంటెన్స్ కొరవడిందనే అనుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే గుణశేఖర్ పెట్టిన ఖర్చును తెరపై సక్రమంగా చూపించలేకపోయారన్నది నిజం.
విశ్లేషణ
రుద్రమదేవి అనే ప్రాజెక్టు గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇప్పుడంటే రెమ్యునిరేషన్లు కోట్లకు కోట్లు పలుకుతున్నాయి కానీ, పారితోషికం పెద్దగా లేని సమయం నుంచే సినిమాలు తీస్తున్నాడు గుణశేఖర్. ఇతరత్రా సినిమాలు తీసినా తృప్తి లేక, రుద్రమదేవిలాంటి సినిమాను నిర్మించడానికి ఎవరూ ముందు రాకపోవడంతో... కొన్నాళ్ళు మానసికంగా నలిగిన గుణశేఖర్ చివరకు తానే నిర్మాతగా దిగి తీసిన సినిమా. ఒక్కమాటలో చెప్పాలంటే ఇన్నేళ్ళు ఆయన సినిమా పరిశ్రమలో సంపాదించిన ప్రతిపైసానూ ఈ సినిమాకే పెట్టారు. ఇద్దరు కుమార్తెల భవిష్యత్తును కూడా ఆలోచించకుండా నమ్మిన విషయానికై పోరాడారు. మరి అంతటి పోరాటం, అందులోనూ ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు కాసింత నిదానం అవసరం. 50, 60,70కోట్లు బడ్జెట్‌తో సినిమా తీశామని చెప్పుకోవడం సులభమే. టాప్ మోస్ట్ టెక్నీషియన్లు ఉన్న మాట కూడా నిజమే. కానీ వారు ఎంత వరకు పనిచేశారు? వారి పని సినిమాకు ఎంతవరకు ఉపయోగపడింది? అనే విషయాన్ని గమనించి ఉండాల్సింది. కథ రాసుకోవడం, అక్కడక్కడ కాసింత స్వతంత్రత తీసుకుని కథనాన్ని నడపడం బాగానే ఉంది. కథనంలో... మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో ఆసక్తి లోపించింది. రుద్రమదేవి స్వతహాగా వీరవనిత. ఎప్పటికప్పుడు బుద్ధిబలాన్ని ఉపయోగిస్తుంది. కానీ చివరికి ప్రజలు కేవలం మహిళ అయినందువల్లనే ఆమె పాలనను ఒప్పుకోవట్లేదు అని చెప్పినప్పుడు స్వతహాగా వాక్చాతుర్యం ఉన్న రుద్రమ ఏమీ నోరు విప్పకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరో సందర్భంలో మహదేవుడితో తలపడటానికి వెళతాడు చాళుక్య వీరభద్రుడు. మరుసటి షాట్ లో మహదేవుడు రుద్రమతో పోరాడుతుంటాడు. వీరభద్రుడి పత్తా ఉండదు. కానీ ఆ సమయంలో రుద్రమను సర్పబంధన సేన నుంచి విముక్తి చేయడానికి గోనగన్నారెడ్డి గరుడబంధన సేనతో ముందుకొస్తాడు. ఆ సందర్భంలో చుట్టుముట్టిన సేనల నుంచి రుద్రమను కాపాడతాడు. ఇప్పటిదాకా చరిత్రలో గోనగన్నారెడ్డి అంటే బందిపోటు అనే ముద్ర ఉంటుంది. కానీ ఈ సినిమాలో గోనగన్నారెడ్డికి ఆ ముద్ర వేసిందే రాణి రుద్రమ అని, అది రాచముద్ర అని నచ్చజెప్పే ప్రయత్నం డ్రమటిక్‌గా ఉంది. చరిత్రలో నిజంగా అలా ఉందా? పరిశోధించి చెప్పిన విషయమైతే ఫర్వాలేదు. కానీ ఒకవేళ సినిమా కోసం రాసినట్టయితే మాత్రం ఈసినిమాను చూస విద్యార్థులు తప్పుదారిపడతారేమో.
అల్లు అర్జున్ ఈ మధ్య ఇంటర్వ్యూలో చెప్పినట్టు అతని నటన, అతని ఎపిసోడ్ బావుంది. ఆ సినిమా అతని వల్ల కేవలం కదలడం మాత్రమే కాదు, థియేటర్లో కూడా ప్రేక్షకులకు ఊరటనిచ్చింది. గోన గన్నారెడ్డి పాత్రను తీర్చిదిద్దినట్టుగా మొత్తం రుద్రమదేవి సినిమాపై శ్రద్ధ పెట్టి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. అనుష్క్ పరిచయమైన షాట్‌లో చూస్తే బాగా తగ్గి రాధికా పండిట్ పోలికలు కనిపిస్తాయి. కానీ తర్వాత రానాతో పాడే డ్యూయట్‌లో అనుష్క చాలా లావుగా కనిపిస్తుంది. పక్కన రానా ఉన్నాడు కాబట్టి సరిపోయిందిగానీ, లేకుంటే ఇంకేముంది? అని అనిపిస్తుంది.
బాటమ్ లైన్
తెలుగు సంస్కృతి, చరిత్రను చాటిచెప్పిన రుద్రమదేవి జీవిత చరిత్రను గుణశేఖర్ అండ్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేసి తెరకెక్కించారు. కేవలం దర్శకత్వంతోనే పరిమితమైపోకుండా నిర్మాతగా కూడా సినిమా పట్ల గుణశేఖర్‌కు ఉన్న ప్యాషన్‌ను రుద్రమదేవి తెలియజేస్తుంది. రెండున్నరేళ్ళ కష్టంతో ఇలాంటి సినిమా చేసినందుకు గుణశేఖర్‌ను తప్పక అభినందించాల్సిందే.
మొత్తం మీద సాహో...గోనగన్నారెడ్డి...
రేటింగ్: 3/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments