RTC :విలీనం బిల్లుకు ఆమోదం తెలపని తమిళిసై.. రోడ్డెక్కిన ఆర్టీసీ కార్మికులు, ప్రజల ఇక్కట్లు
- IndiaGlitz, [Saturday,August 05 2023]
తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలపకపోవడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంయూ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కార్మికులు విధులు బహిష్కరించారు. రెండు గంటల తర్వాత మళ్లీ డ్యూటీ ఎక్కడంతో ఆర్టీసీ సేవలు యథాతథంగా ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో విద్యార్ధులు, ఉద్యోగులు, అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాజ్‌భవన్ వద్దకు భారీగా చేరుకున్న కార్మికులు :
మరోవైపు ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్ వద్ద నిరసన చేపట్టాలని టీఎంయూ నిర్ణయించింది. దీంతో కార్మికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని గవర్నర్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. బస్సుల్లో చేరుకున్న కార్మికులు, ఉద్యోగులు.. నెక్లెస్ రోడ్ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. ముందు జాగ్రత్త చర్యగా రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
బిల్లుపై వివరణ కోరిన తమిళిసై :
కాగా.. ఆర్టీసీ ముసాయిదా బిల్లు ఈ నెల 2న మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరింది. దీనిపై న్యాయపరమైన సలహాలు పొందాల్సిన అవసరం వుందని, బిల్లుపై సంతకం చేసేందుకు మరికొంత సమయం కావాలని తమిళిసై తెలిపారు. అంతేకాదు.. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో లేరు. ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును తాను క్షుణ్ణంగా పరిశీలించానని, కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్‌ను తమిళిసై కోరారు. దీంతో బిల్లుపై గవర్నర్ కాలయాపన చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.