రేపటి నుంచి ఏపీ, తెలంగాణల మధ్య బస్సులు పున: ప్రారంభం..

  • IndiaGlitz, [Monday,November 02 2020]

తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న అంతరాష్ట్ర బస్సుల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. మంగళవారం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగి ప్రారంభం కానున్నాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణ ఆర్టీసీ చేస్తున్న డిమాండ్‌ను ఏపీఎస్‌ఆర్టీసీ తాజాగా అంగీకరించింది. ఈ నేపథ్యంలో.. 1.61 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను నడుపుకోవడానికి ఇరు ఆర్టీసీల మధ్య సోమవారం ఒప్పందం జరగనుంది. ఈ మేరకు ఈ రోజు హైదరాబాద్‌లో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కార్యాలయంలో ఇరు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ ఎండీలు భేటీ కానున్నారు.

రెండు సంస్థల ఎండీలూ మధ్యాహ్నం 2.45 గంటలకు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే ఎంవోయూపై సంతకాలు చేయనున్నారు. ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ బస్సులు నడపాలన్న విషయంపై నేడు ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఏపీ బస్సులు గతంలో 2.61 లక్షల కిలోమీటర్ల మేర తిరిగేవి. తెలంగాణ మాత్రం ఏపీలో 1.61 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను నడిపేది. అయితే దీనిపై టీఎస్‌ఆర్టీసీ షరతు విధించింది. ఏపీలో తాము ఎన్ని కిలోమీటర్ల మేర బస్సులను నడుపుతామో.. ఏపీ కూడా ఇక్కడ అన్నే కిలోమీటర్ల మేర నడపాలని షరతు విధించింది‌. దీనికి తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ అంగీకరించింది. 50 వేల కిలోమీటర్ల మేర తగ్గించుకునేందుకు ఏపీ ముందుకు వచ్చింది.

అయితే తెలంగాణ ఏపీలో అదనంగా 50 వేల కిలోమీటర్ల మేర అధికంగా బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది.ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. అన్ని కిలోమీటర్లు బస్సులు నడపలేమని స్పష్టం చేిసంది. ఈ అంశంపై చాలా ప్రతిష్ఠంభన నెలకొనడంతో ఇరు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలు జరగలేదు. ఎట్టకేలకు ప్రయాణికుల కష్టాలు, ఆర్టీసీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో 1.61 లక్షల కిలోమీటర్ల మేరకే బస్సులు నడపడానికి ఏపీఎస్‌ ఆర్టీసీ అంగీకరించడంతో ఒప్పందానికి రంగం సిద్ధమైంది. దీంతో.. చాలా రోజులుగా నిలిచిపోయిన ప్రజారవాణా తిరిగి ప్రారంభం కానుంది.