హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థికి చెందిన 8 కోట్లు స్వాధీనం
- IndiaGlitz, [Monday,April 08 2019]
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు రోజులు దగ్గరపడుతుండటంతో ఎక్కడికక్కడ నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. సోమవారం నాడు హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుబడింది. నగరంలోని నారాయణగూడ వై జంక్షన్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వై జంక్షన్ వద్ద వున్న ఇండియన్ బ్యాంక్‌కు చేరుకున్న పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వర్ణా కారులో తరలిస్తున్న 2 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. వాహనంలో నగదు తరలిస్తున్న తోటిరెడ్డి ప్రదీప్ రెడ్డి, గుద శంకర్ కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ డబ్బంతా బీజేపీ ఫండ్‌గా పోలీసులు చెబుతున్నారు.
హిమాయత్ నగర్ సర్కిల్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా సమాచారం రావడంతో హుటాహుటిన నారాయణగూడలో ఓ బ్యాంకు వద్దకు మా సిబ్బంది చేరుకుని పట్టుకోవడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. పోలీసులు అక్కడికి వెళ్లి మరో రూ.6కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు చేపట్టి నగదు పట్టుకుంటున్నప్పటికీ ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడటం ఇదే తొలిసారి. అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ప్రదీప్ రెడ్డి, గుదా శంకర్ , గార్లపాటి సుకుమార్ రెడ్డి, సమ్మట చలపతిరాజు, జూలూరి హిందూ శేఖర్ రావు,రాచకట్ల బ్రహ్మంల నుంచి నగదుపై వివరాలు ఆరా తీస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడంతో ఇటు ఎన్నికల అబ్జర్వేషన్ అధికారులు, ఐటీ అధికారులు నారాయణ గూడ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆరా తీసారు.
బీజేపీ స్పందన..
ఈ భారీ నగదు వ్యవహారంపై బీజేపీ స్పందించింది. నారాయణగూడలో పట్టుబడ్డ నగదు పార్టీది అని తెలంగాణ బీజేపీ స్పష్టం చేసింది. పార్టీ అకౌంట్ నుంచి డ్రా చేశామని.. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారని టి. బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీని వెనుక టీఆర్ఎస్ కుట్ర ఉందన్నారు. వివిధ వస్తువులు సరఫరా చేసిన వారికి బకాయిలు చెల్లించేందుకు ఆ డబ్బు డ్రా చేశామని బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే మరి.