KTR: నాంపల్లి అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5లక్షల సాయం: కేటీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5లక్షల పరిహారం ప్రకటిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 9 మంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మరికొందరు అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిపారు. వీరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మృతుల్లో నాలుగు రోజుల పసికందు సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహమ్మద్ ఆజమ్ (58), మహ్మద్ హసీబుర్ రెహమాన్(32), రెహనా సుల్తానా (50), బీడీఎస్ డాక్టర్ తహూరా పర్హీన్ (35), టుబా(5), టరూబా (12), ఫైజా నమీన్(26), జకీర్ హుస్సేన్ (66), నికత్ సుల్తానా (55) మృతిచెందినట్లు ప్రకటించారు.
మరోవైపు అగ్నిప్రమాద ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ రాగా ఎంఐఎం నేతలు, కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఇక అపార్టుమెంటు ఓనర్ రమేశ్ జైశ్వాల్‌కు కెమికల్ కంపెనీలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సెల్లార్‌లో కెమికల్ డ్రమ్ములను ఉంచారు. పాస్టిక్ తయారీకి వినియోగించే ఈ డ్రమ్ములకు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున చెలరేగాయి. కాగా ప్రమాదం అనంతరం రమేశ్ జైశ్వాల్ పరారయ్యాడు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments