ఆడపడుచుల ఖాతాల్లోకి రూ.2500 నుంచి రూ.3500 నగదు బదిలీ
- IndiaGlitz, [Monday,March 25 2019]
సామాన్యుడిని నాయకుణ్ణి చేస్తాను అని చెప్పాను.. చేసి చూపించానని జనసేన అధినేత పవన్ స్పష్టం చేశారు. జనసేన ఎన్నికల శంఖారావంలో భాగంగా కైకలూరులో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. డబ్బు ఉన్నవారు వద్దు.. చిత్తశుద్ది ఉన్న వారు కావాలని కోరుకున్నానని, అందుకే ఈ రోజు ఏ అసెంబ్లీకి టిక్కెట్టు ఇచ్చినా ఎలాంటి గొడవలు లేవన్నారు. ఐదు సంవత్సరాల క్రితం మీలా జనం మధ్యన ఉన్న వ్యక్తిని నాయకుణ్ణి చేయడం ద్వారా పార్టీ కోసం పని చేసే వారిని జనసేన ఎలా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందో చేసి చూపామన్నారు. పార్టీ కోసం నేను ఎవర్నీ లక్షలు ఖర్చు పెట్టమని చెప్పలేదు. పని చేయమని మాత్రమే చెప్పాను. రూపాయి రూపాయి ఖర్చు పెట్టిన వారంతా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని నెలకి రూ. 60-70 వేలు సంపాదించుకునే వారే. వారే పార్టీని నడిపించారు. నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు ముందుండి పార్టీని నడిపించారు. వారి నుంచి నాయకుల్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు స్థానిక సమీకరణాల ఆధారంగా, టీడీపీ-వైసీపీ అనుసరించే వ్యూహాల ఆధారంగా అభ్యర్ధుల్ని ఎంపిక చేశాను. పార్టీ నిర్ణయానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. కైకలూరులో జనసేన జెండా ఎగరడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను అని పవన్ తెలిపారు.
నెలకి రూ. 2500 నుంచి రూ. 3500
జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలి సంతకం రైతులకి నెలకి రూ. 5 వేలు ఇచ్చే ఫించన్ ఫైలు మీద పెడతాం. మరో సంతకం ఆడపడుచులకి రేషన్ బాధలు లేకుండా చేసి, కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి నెలకి రూ. 2500 నుంచి రూ. 3500 అకౌంట్లలో వేసే నగదు బదిలీ పథకం ఫైలు మీద పెడతాం. యువత కోసం మూడు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ఫైలు మీద మూడో సంతకం పెడతా.
కైకలూరు నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇక్కడ ప్రజలకి కొల్లేటి కోట లాంటి ప్రాంతాలకి వంతెన సౌకర్యాలు కావాలి. వారధి డిమాండ్ ఒకటి ఉంది. ఇక్కడ ప్రజలు కోరుకుంటున్న ప్రతి చోటా వంతెనలు నిర్మిస్తాం. పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయానికి రహదారులు అభివృద్ది చేస్తాం అని జనసేనాని చెప్పుకొచ్చారు.