Telangana Elections: తనిఖీల్లో రూ.1760కోట్లు పట్టివేత.. తెలంగాణలోనే అత్యధికం..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నగదు, మద్యం ఏరులైపారుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నారు. దీంతో అన్ని పార్టీలు ఈ రాష్ట్రాల్లో విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు ఎర వేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలను విస్తృతం చేశారు. ఈ నేపథ్యంలో అధికారుల తనఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇప్పటివరకు మొత్తం రూ.1750కోట్ల అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, బహుమతులు, ఇతరత్రా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సీఈసీ వెల్లడించింది. అక్టోబరు 9న ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి ఈ మొత్తాన్ని సీజ్ చేసినట్లు తెలిపింది.
తెలంగాణలో అత్యధికంగా దాదాపు రూ.659 కోట్ల మేర సీజ్ చేసినట్లు పేర్కొంది. ఇక రాజస్థాన్ లో రూ.650.7 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.323.7 కోట్లు, ఛత్తీస్ గఢ్ రూ.76.9 కోట్లు సీజ్ చేసినట్లు వెల్లడించింది. కాగా 2018లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీజ్ చేసిన దాంతో పోలిస్తే వీటి విలువ దాదాపు ఏడు రెట్లు ఎక్కువని చెప్పింది. గత ఎన్నికల్లో కేవలం రూ.239.15 కోట్లు పట్టుబడగా.. ఈసారి ఏకంగా రూ.1760కోట్లు అక్రమంగా పట్టుబడినట్లు ప్రకటించింది.
ఇక ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఈ నెల 25న రాజస్థాన్‌లో, 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తనిఖీల సందర్భంగా తెలంగాణలోనే అత్యధికంగా నగదు పట్టుకున్నట్లు ఈసీ వెల్లడించింది. తెలంగాణలో సీజ్ చేసిన నగదు మొత్తంలో రూ.225.23 కోట్ల నగదు రూపంలో ఉండగా, రూ.86.82 కోట్ల విలువైన మద్యం, రూ.103.74 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, రూ.191.02 కోట్ల విలువైన బంగారం, వెండి, ఆభరణాలు, ఓటర్లకు ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న రూ.52.41 కోట్ల విలువైన వస్తువులు ఉన్నట్లు తెలిపింది. పోలింగ్ ముగిసేనాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments