ఆర్ఆర్ఆర్ ఓటీటీ ట్రైలర్: థియేటర్‌లో లేని సీన్లు కూడా, ఆడియన్స్‌కి ఫుల్ మిల్స్
- IndiaGlitz, [Friday,May 13 2022]
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి సీరిస్‌తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్‌తోనూ మరోసారి మ్యాజిక్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి తెలుగు సినిమా సత్తా చాటింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ కోసం ఓటీటీ ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓటీటీ సంస్థ జీ 5 శుక్రవారం కీలక ప్రకటన చేసింది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 20 నుంచి ‘ఆర్ఆర్ఆర్’ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కొన్ని స్పెషల్ షాట్స్‌తో సరికొత్త ట్రైలర్‌ని జీ 5 విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్‌ని హైలైట్ చేశారు. దీంతో పాటు థియేటర్‌లో లేని సన్నివేశాలను, డిలీట్ చేసిన సీన్స్‌ను కూడా ఓటీటీ ప్రేక్షకులకు అందించే అవకాశం కనిపిస్తోంది.
4k క్వాలిటీ, డాల్బీ డీటీఎస్ లో ప్రేక్షకులు సినిమాను చూడవచ్చని.. TVOD పద్ధతిలో వీక్షకులకు సినిమా అందుబాటులో ఉంటుందని జీ 5 తెలిపింది. ఇకపోతే.. హిందీ వెర్షన్ హక్కులను, ఆల్ లాంగ్వేజెస్ ఓటీటీ హక్కులను దక్కించుకున్న ‘పెన్ స్టూడియోస్’ అధినేత జయంతి లాల్.. ఆర్ఆర్ఆర్ విడుదలైన మూడు నెలల తరువాతే ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని ఇంతకు ముందు చెప్పిన సంగతి తెలిసిందే.
దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ ఆడి పాడారు. శ్రియా శరన్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.