2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. నెటిజన్ల ప్రశ్నలు, లాజిక్ ఏంటంటే..?

  • IndiaGlitz, [Friday,August 25 2023]

69వ జాతీయ చలనచిత్ర అవార్డులను భారత ప్రభుత్వం గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో తెలుగు సినిమా సత్తా చాటింది. పుష్ప, ఆర్ఆర్ఆర్, ఉప్పెన చిత్రాలకు అవార్డులు దక్కాయి. అంతేకాదు.. జాతీయ స్థాయిలో ఏకంగా పది పురస్కారాలు టాలీవుడ్‌ను వరించాయి. ఇక తెలుగువారికి అందని ద్రాక్షగా వున్న ‘‘ జాతీయ ఉత్తమ నటుడు’’ అన్న కలను అల్లు అర్జున్ తీర్చేశాడు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. అంతా బాగానే వుంది కానీ.. 2021వ సంవత్సరానికి గాను అవార్డులు ప్రకటిస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది. కానీ వీటిలో 2022 నాటి సినిమాలు వుండటంతో నెటిజన్లకు అనేక సందేహాలు వెల్లువెత్తాయి.

2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులు .. ఎలా సాధ్యం:

2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులు ఇవ్వడం ఏంటని కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ (2022 మార్చి 24), రాకెట్రీ సినిమా (జూలై 1, 2022), గంగూభాయ్ కతియావాడి ( 25 ఫిబ్రవరి 2022)లు విడుదలయ్యాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఏకంగా 6, గంగూబాయ్ కతియవాడిలో నటనకు గాను బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌కు జాతీయ ఉత్తమ నటి అవార్డ్ దక్కింది. ఇక జాతీయ ఉత్తమ చిత్రంగా రాకెట్రీ సినిమా నిలిచింది.

సెన్సార్ సర్టిఫికేటే కొలమానం:

2021లో విడుదలైన సినిమాలకు ఇవ్వాల్సిన పురస్కారాలను 2022లో రిలీజైన మూవీస్‌కు ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై నిన్నటి మీడియా సమావేశంలోనే కేంద్ర సమాచార, ప్రసారశాఖ అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్‌ను విలేకరులు ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు సెన్సార్ సర్టిఫికెట్‌ను పొందాయని.. అందువల్ల ఆర్ఆర్ఆర్, గంగూభాయ్, రాకెట్రీ సినిమా తదితర చిత్రాలను 2021వ సంవత్సరానికి సంబంధించిన సినిమాలుగానే పరిగణిస్తామని నీర్జా శేఖర్ చెప్పారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్‌‌కు 2021 డిసెంబర్‌లోనే సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిపికెట్ ఇచ్చిందని ఆయన తెలిపారు. దీనిని పరిగణనలోనికి తీసుకునే 2021వ సంవత్సరానికి గాను పలు కేటగిరీల్లో ఈ సినిమాకు అవార్డులు ప్రకటించినట్లు నీర్జా శేఖర్ పేర్కొన్నారు. ఇదే సూత్రం మిగిలిన సినిమాలకు కూడా వర్తిస్తుందన్నారు.