ట్రెండ్ ఫాలో అవ్వ‌ను...ట్రెండ్ సెట్ చేయ‌ను - ఆర్.పి.ప‌ట్నాయ‌క్

  • IndiaGlitz, [Wednesday,March 09 2016]

సంగీత ద‌ర్శ‌కుడుగా..న‌టుడుగా..ర‌చ‌యిత‌గా..ద‌ర్శ‌కుడిగా...త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న‌ బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి ఆర్.పి.ప‌ట్నాయ‌క్. క‌ల‌ర్స్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై ఆర్.పి.ప‌ట్నాయ‌క్ తెర‌కెక్కించిన తాజా చిత్రం తుల‌సీద‌ళం. నిశ్చ‌ల్ దేవ్, వంద‌న గుప్త‌, బ్ర‌హ్మానందం, ఆర్.పి.ప‌ట్నాయ‌క్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన తుల‌సీద‌ళం చిత్రాన్ని ఈ నెల 11న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆర్.పి.ప‌ట్నాయ‌క్ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...

హ‌ర్ర‌ర్ మూవీస్ అంటే ఎక్కువ చీక‌టి ఉంటుంది క‌దా..కానీ తుల‌సీద‌ళం చిత్రాన్నివెలుతురులోనే తీసారు కార‌ణం ఏమిటి..?

హ‌ర్ర‌ర్ అంటే చీక‌టి అవ‌స‌రం లేదు. ఒంటిరిగా వెలుతురులో కూర్చొన్నా..భ‌య‌మేస్తుంది. అలాంటి సంద‌ర్భాలు నాకు చాలా సార్లు వ‌చ్చాయి. అందుచేత హ‌ర్ర‌ర్ అంటే చీక‌టి అవ‌స‌రం లేదు అనుకుని తీసిన సినిమా ఇది. సినిమా చూస్తే.. చాలా చోట్ల భ‌య‌ప‌డ‌తారు.

ప్ర‌పంచంలో ఎన్నో బ్రైట్ ప్లేసెస్ ఉన్నా..లాస్ వేగాస్ నే ఎందుకు ఎంచుకున్నారు..?

ప్ర‌పంచంలో లాస్ వేగాస్ క‌న్నా బ్రైట్ ప్లేస్ ఎక్క‌డా లేదు. అందుక‌నే ఈ ప్లేస్ ఎంచుకున్నాను.

తుల‌సీద‌ళంలో డివైన్ ఎలిమెంట్ ఉంటుందా..?

ఎక్స్ ట్రా హుమ‌న్ ఎలిమెంట్ అయితే ఉంది. డివైనా..డేవిల్లా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్.

తుల‌సీద‌ళం ఎలా ఉంటుంది..?

ఇది కొత్త క‌థ‌. కొత్త‌గా ఉంటుంది. ఇందులో ల‌వ్ స్టోరి కూడా ఉంటుంది. కొత్త‌వాళ్ల‌తో ఎప్పుడూ కొత్త‌గానే ఉంటుంది. ఖ‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంది అని నా న‌మ్మ‌కం.

ఇందులో మీ క్యారెక్ట‌ర్ ఏమిటి..?

తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి గెట‌ప్ తో ఎటువంటి క్యారెక్ట‌ర్ రాలేద‌ని చెప్ప‌వ‌చ్చు. క్యారెక్ట‌ర్ విష‌యానికి వ‌స్తే...అమెరికాలో సైకీక్రీడ‌ర్ అంటారు అలాగే గోస్ట్ రీడ‌ర్ అని కూడా అన‌వ‌చ్చు. ఇండియాలో భూత వైద్యుడు అంటారు. ఇంకా చెప్పాలంటే అమెరికాలో ఉండే తెలుగు భూత వైద్యుడు.

మీకు 24 క్రాఫ్ట్స్ పై ప‌ట్టు ఉంది కదా...అది ఎలా సంపాదించారు...?

మ‌నం ఏదైనా నేర్చుకోవాలంటే ముందుగా అబ్జ‌ర్వ్ చేయాలి. ఎప్పుడైతే అబ్జ‌ర్వ్ చేస్తామో లెర్నింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఫ‌స్ట్ సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి మూమెంట్ ను అబ్జ‌ర్వ్ చేస్తున్నాను. ప్ర‌తి డిపార్టెమెంట్ ని ప‌రిశీలిస్తే ఏ ప‌ని ఎలా చేస్తే ఎలా వ‌స్తుంది అనేది తెలుస్తుంది. అలా చేయ‌డం వ‌ల‌నే 24 క్రాఫ్ట్స్ గురించి మాట్లాడ‌గ‌లిగే అవ‌గాహ‌న అయితే వ‌చ్చింది.

మీడియా పై సినిమా తీస్తున్నారు క‌దా..ఇందులో మెసేజ్ ఏమైనా ఉంటుందా..?

ఇందులో మెసేజ్ క‌న్నా...అంద‌ర్నీ ప్ర‌శ్నించే మీడియాని ప్ర‌శ్నించేది ఎవ‌రు అనే పాయింట్ తో సినిమా తీస్తున్నాను. మీడియాను ఓ సామాన్యుడు ప్ర‌శ్నిస్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను.

మీ ప్ర‌తి సినిమాలో ఏదోటి మెసేజ్ ఉంటుంది కార‌ణం ఏమిటి..?

తేజ ఎప్పుడూ ఓ మాట అంటుంటారు...అదేమిటంటే మ‌నం మెసేజ్ ఇచ్చినంత మాత్రాన జ‌నం మారిపోర‌ని. అలా అని జ‌నం మారాలి అని సినిమాలు చేయ‌ను. క‌థలు కోసం ఫ్రెంచ్ సినిమానో ఇంగ్లీషు సినిమానో చూడ‌న‌వ‌స‌రం లేదు. మ‌నలోనే ఎన్నో క‌థ‌లు ఉన్నాయి. ఎప్పుడైతే మ‌న‌లోంచి క‌థ‌లు వెతుకుతామో అవి సోష‌ల్ ఎలిమెంట్స్ అవుతాయి. సోష‌ల్ ఎలిమెంట్స్ తీసుకుంటే అందులో ఎంతో కొంత మెసేజ్ ఉంటుంది. అలా తీసుకుని చేసినవే నా సినిమాలు

మీ ద‌గ్గ‌ర చాలా ఐడియాస్ ఉన్న‌ప్ప‌టికీ ఎందుకు స్లోగా సినిమాలు చేస్తున్నారు..?

నాకు మూడు నెల‌ల‌కు ఒక సినిమా చేయాల‌ని ఉంటుంది.అయితే నేను కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ చేస్తుంటాను. ఆడియోన్స్ ఎక్కువ స్టార్ హీరోల సినిమాల‌కే ప్రాధాన్య‌త ఇస్తుంటారు. ఎప్పుడైతే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ఆద‌ర‌ణ పెరుగుతుందో అప్ప‌టి నుంచి మూడు నెల‌ల‌కు ఒక సినిమా చేస్తాను.

డైరెక్ట‌ర్ అయిన త‌ర్వాత మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా చేయ‌డం మానేసారు. ఇక మ్యూజిక్ చేయ‌రా..?

అవ‌కాశం వ‌స్తే చేస్తాను. నేను ట్రెండ్ ఫాలో అవ్వ‌ను...ట్రెండ్ సెట్ చేయ‌ను. సినిమాకి ఏం కావాలో అదే చేస్తాను.

తుల‌సీద‌ళం గురించి ఫైన‌ల్ గా ఏం చెబుతారు...?

ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో హ‌ర్ర‌ర్ మూవీస్ చూసారు. ఇది ఒక కొత్త హ‌ర్ర‌ర్ సినిమా.