బ్రోకర్ సినిమా నచ్చనివాళ్లు మనలో ఒకడు సినిమాకు రావద్దు - ఆర్పీ.పట్నాయక్
Send us your feedback to audioarticles@vaarta.com
సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి....ఆతర్వాత నటుడుగా, దర్శకుడుగా మారి విభిన్న కథా చిత్రాలను అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ టర్నడ్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్. అందమైన మనసులో, బ్రోకర్, ఫ్రెండ్స్ బుక్, తులసీదళం...ఇలా రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కిస్తున్న ఆర్పీ.పట్నాయక్ తాజాగా రూపొందించిన చిత్రం మనలో ఒకడు. మీడియా వలన ఓ సామాన్యుడుకి ఇబ్బంది కలిగితే ఏం చేసాడు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఈ విభిన్న కథా చిత్రాన్ని ఈనెల 4న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ టర్నడ్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ తో ఇంటర్ వ్యూ మీకోసం...!
మీడియా పై తీసిన మనలో ఒకడు కథాంశం ఏమిటి..? ఈ సినిమా ద్వారా ఏం చెబుతున్నారు..?
మీడియా వ్యవస్థను ప్రశ్నించే సినిమా ఇది. మీడియాలో ఉన్న చాలా మందికి మేము మీడియా అనే ఈగో ఉంటుంది. ఆ ఈగో వలన చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు అని నా అభిప్రాయం. రియల్ ఇన్సిడెంట్స్ కూడా ఇందులో చూపిస్తున్నాను. మీడియా ఈగో వలన కామన్ మేన్ బాధపడుతున్నాడు. ఒక ఉదాహరణ చెప్పాలంటే...కమెడియన్ వేణుమాధవ్ బతికి ఉండగానే చనిపోయాడు అంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేసాయి. ఆ వార్తల వలన తను చాలా ఇబ్బంది పడ్డాడు. వాళ్ల న్యూస్ కరెక్ట్ అని చెప్పడం కోసం నన్ను ఎక్కడ చంపేస్తారో అని భయంగా ఉంది అంటూ వేణుమాధవ్ గవర్నర్ ను కలిసాడు. అలాగే ఎం.ఎస్ నారాయణ చనిపోక ముందే చనిపోయాడు అంటూ వార్తలు ప్రసారం చేసాయి. మీడియా పర్సనల్ లైఫ్ లోకి వెళ్లిపోయి ఇబ్బంది పెట్టడం తప్పు. ఏది నిజమో అదే చెప్పండి అని ఈ సినిమా ద్వారా చెబుతున్నాను.
ఈ చిత్రంలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
నేను ఈ చిత్రంలో కృష్ణమూర్తి అనే లెక్చరల్ క్యారెక్టర్ చేసాను. అతనికి మీడియా వలన ఏం నష్టం కలిగింది. అతను ఏం చేసాడు అనేది సినిమాలో చూడాలి.
మీడియా పై ఆర్పీ సెటైర్ అనుకోవచ్చా..?
ఇది సెటైర్ కాదు సీరియస్ గానే చెబుతున్నాను.
మీ సినిమాల్లో మీరే నటిస్తుండడానికి కారణం..?
నేనే చేయాలి అని కాదు. కథ రాసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ కు నేను సూటవుతాను అనుకుంటేనే చేస్తాను. ఈ సినిమా విషయానికి వస్తే...ఈ క్యారెక్టర్కి నా కన్నా బెటర్ ఆర్టిస్ట్ లేక నేను చేసాను. ఒక కామన్ మేన్ లా కనిపించాలి అందుకనే ఈ క్యారెక్టర్ నేను చేసాను.
మీడియాని విమర్శిస్తూ సినిమా తీసారు కదా..! మీడియా నుంచి విమర్శలు వస్తాయని ఆలోచించలేదా..?
సినిమా సెన్సార్ అవుతుందా లేదా అని ఆలోచించాను కానీ...మీడియా నుంచి విమర్శలు వస్తాయి అని ఆలోచించలేదు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది మీడియా ప్రతినిధులు నన్ను అభినందిస్తారు అని నా నమ్మకం.
ఈ మూవీ చూసిన సెన్సార్ మెంబర్స్ ఏమన్నారు..?
ఇలాంటి సినిమా చేయడానికి ధైర్యం కావాలి. ఓ మంచి సినిమా తీసారు అని అభినందించారు. అలాగే ఇటీవల కొంత మందికి ప్రివ్యూ వేసి చూపించాను. ప్రివ్యూ చూసిన వాళ్లందరూ ఇప్పటి వరకు మీరు మంచి సినిమాలు తీసారు ఇప్పుడు గొప్ప సినిమా తీసారు అని అభినందించారు.
ఎంటర్ టైన్మెంట్ కోరుకుంటున్న ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందా..?
ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్, సెంటిమెంట్, సస్పెన్స్...ఇలా ఆడియోన్స్ ఏమాత్రం బోర్ ఫీలవకుండా ఇంట్రస్టింగ్ గా చూసేలా అన్ని అంశాలు ఉన్నాయి. బ్రోకర్ సినిమా నచ్చిన వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది. బ్రోకర్ సినిమా నచ్చనవాళ్లు ఈ సినిమాకి రావద్దు.
ఈ మూవీ కోసం రీసెర్చ్ ఏమైనా చేసారా..?
మీడియాలో నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. వారి అభిప్రాయాలను, అనుభవాలను అడిగి తెలుసుకున్నాను. అలాగే ఈ సినిమా కోసం గత కొన్నేళ్లుగా మీడియాను పరిశీలిస్తున్నాను. దీంతో పాటు ఈ సినిమాకి కావలసిన అంశాల గురించి రీసెర్చ్ చేసాను.
ఇక మ్యూజిక్ ని వదిలేసినట్టేనా..?
అలాంటిది ఏమీ లేదు. మంచి కథ కుదిరితే...ఆ కథకు నేను మ్యూజిక్ చేస్తే బాగుంటుంది అనిపిస్తే తప్పకుండా మ్యూజిక్ చేస్తాను.
మనలో ఒకడు చిత్రాన్ని రీమేక్ చేసే ప్లాన్ ఉందా...?
కన్నడలో రీమేక్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. సాయికుమార్ నేను పోషించిన పాత్ర చేస్తాను అంటున్నారు. కన్నడ రీమేక్ కి నేనే డైరెక్షన్ చేస్తానా వేరే ఎవరైనా చేస్తారా అనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. ఈ చిత్రాన్ని కన్నడలో గాలి జనార్ధనరెడ్డి నిర్మించనున్నారు.
ఈ మూవీకి అవార్డ్ వస్తుంది అనుకుంటున్నారా..?
ఈ చిత్రంలో సునీత మధురం అనే పాట పాడింది. ఈ పాటకు గాను సునీతకు నేషనల్ అవార్డ్ వస్తుంది అనుకుంటున్నాను. ఈ పాట విన్న తర్వాత బాలు గారు కూడా ఇదే మాట అన్నారు.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
మూడు కథలు రెడీగా ఉన్నాయి. మెడికల్ మాఫియా పై సినిమా తీయాలి అనుకుంటున్నాను. ధృవ రిలీజ్ తర్వాత మెడికల్ మాఫియా పై సినిమా తీయాలా వద్దా అనేది నిర్ణయిస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments