అయేషా తల్లి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా రియాక్షన్...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ అయేషా మీరా హత్య కేసు ఇప్పుడు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. దీంతో విచారణ మరింత వేగవంతమైంది. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఇవాళ మృతదేహానికి రీపోస్టుమార్టమ్ నిర్వహించం జరిగింది. అయితే ఈ క్రమంలో అయేషా తల్లి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ కేసు జరుగుతున్నప్పుడు హడావుడి చేసి రోజా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు.?.. దోషులెవరో రోజాకు తెలుసు. 21 రోజుల్లో నిందితుల్ని పట్టుకుంటామన్న సీఎం జగన్... ఆయేషా కేసును కూడా పరిగణలోనికి తీసుకోవాలి. దేశంలో న్యాయం ఉందన్న నమ్మకం లేదు. న్యాయంకోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం’ అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఆమె వ్యాఖ్యలపై రోజా రియాక్ట్ అయ్యారు.

నన్ను బాధించాయి..!

‘అయేషా తల్లి వ్యాఖ్యలు నన్ను బాధించాయి. అప్పట్లో ఓ మహిళా అధ్యక్షురాలిగా ఆయేషా కుటుంబానికి అండగా ఉన్నాను. రాష్ట్రమంతా తిరిగి న్యాయం కోసం పోరాటం చేశాను’ అని రోజా చెప్పుకొచ్చారు. కాగా.. 12 ఏళ్ల తర్వాత ఇవాళ అయేషా మృతదేహానికి రీ-పోస్టుమర్టం నిర్వహించారు. సుమారు ఆరు గంటలకు పైగా.. అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ పూర్తి జరిగింది. అయితే మృతదేహాన్ని వెలికితీసి నిశితంగా ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి.. ఆనవాళ్లు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. కాగా.. ఎముకలు, కేశాలు, గోళ్లను క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణులు.. పుర్రె, అస్థికలపై గాయాలున్నట్లు గుర్తించారు. ఆధారాలు సేకరించి పూర్తి నివేదిక తయారుచేయనున్నట్లు ఫోరెన్సిక్ బృందం ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించింది.