పార్టీ మారతారంటూ వార్తలు.. ప్రాణం వున్నంత వరకు జగన్‌తోనే అన్న రోజా
- IndiaGlitz, [Monday,February 07 2022]
ఆర్కే రోజా... హీరోయిన్‌గా దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన ఈ భామ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించింది. తొలుత తెలుగుదేశం పార్టీలో చేరిన రోజా అక్కడ ఇమడలేక వైసీపీలో చేరారు. జగన్‌కు అండగా నిలుస్తూ.. చిత్తూరు జిల్లా నగరి నుంచి 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. కానీ చిత్తూరు జిల్లా కోటాలో రెండు మంత్రి పదవులను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామిలకు కేటాయించారు సీఎం. దీంతో రోజాకు అవకాశం లేకుండా పోయింది. రెండున్నరేళ్ల తర్వాత అవకాశం ఇస్తామని బుజ్జగించి ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు జగన్. ఇప్పుడు ఆమె వద్ద నుంచి దానిని కూడా లాక్కొన్నారు. మంత్రి పదవి వస్తుందనుకుంటే.. ఉన్న పదవి కూడా పోవడంతో రోజా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో తన సొంత నియోజకవర్గంలో నగరిలో ఆమెకు సొంత పార్టీ నుంచే పొగ మొదలైంది.
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ వైఎస్ఆర్‌సీపీకి చెందిన బలమైన నేతలు రోజాకు అసమ్మతి వర్గంగా ఏర్పడ్డారు. ఆమెకు చెప్పకుండా, కనీసం పట్టించుకోకుండా పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీనిపై పలుమార్లు జగన్ దృష్టికి తీసుకెళ్లినా.. ఆయన పట్టించుకోకపోగా, ఆ వ్యతిరేక వర్గంలో ఇద్దరు బలమైన నేతలకు రాష్ట్ర స్థాయి పదవులను అప్పగించారు. నగరి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కేజీ కుమార్ సతీమణి శాంతికి ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ పదవి, శ్రీశైలం ఆలయ బోర్డు చైర్మన్ పదవిని రెడ్డివారి చక్రపాణి రెడ్డికి ఇచ్చారు. ఈ పరిణామాలతో రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె పార్టీ మారతారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారానికి రోజా తనదైన శైలిలో కౌంటరిచ్చారు రోజా. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తెలంగాణకు వెళుతున్నానని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. సొంత చెల్లిగా భావించి రెండు సార్లు ఎమ్మెల్యేను చేసిన జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని, ప్రాణం ఉన్నంత వరకు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని ఆర్కే రోజా క్లారిటీ ఇచ్చారు.