రోజా, అంబటి, ఆళ్లకు త్వరలో కీలక బాధ్యతలు!
- IndiaGlitz, [Tuesday,June 11 2019]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రి పదవులు ఆశించి.. చివరి నిమిషం వరకు పక్కా అనుకుని దక్కించుకోలేకపోయిన వారిలో రోజా, అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. సామాజిక వర్గం పరంగా లెక్కలేసిన వైఎస్ జగన్ ఈ ముగ్గురికీ పదవులు ఇవ్వలేకపోయారు. అయితే కేబినెట్లోకి తీసుకోలేకపోయిన జగన్ వీరికి న్యాయం చేయాలని భావించి.. వీరి సేవలను మరో విధంగా వినియోగించుకోవడానికి వ్యూహ రచన చేస్తున్నారు. ఇంతకీ అదేంటి.. ఈ ముగ్గురికి జగన్ అప్పగించే కీలక బాధ్యతలు ఇప్పుడు చూద్దాం.
ఈ ముగ్గురు కీలక నేతలకూ మూడు హిస్టరీలే ఉన్నాయ్.. అవేంటో.. వారిని త్వరలో వరించబోయే పదవుల గురించి ఇప్పుడు చూద్దాం.
రోజాకు జగన్ ఇచ్చే పదవి ఇదేనా..!
ఒకానొక టైమ్‌లో నగరి అంటే గాలి ముద్దుకుష్ణమ.. గాలి అంటే నగరి అనే విధంగా పరిస్థితులు ఉండేవి.. అయితే వన్స్ రోజా స్టెప్ ఇన్ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో గాలి కుటుంబాన్ని ఘోరంగా ఓడించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు రోజా.. అయితే మంత్రి పదవి మాత్రం జస్ట్ మిస్సయ్యింది. అయితే రోజాకు మాత్రం ‘నవ రత్నాలు’ అమలుకు సంబంధించి బాధ్యతలు మొత్తం ప్రత్యేకంగా రోజాకే కట్టబెట్టాలని వైఎస్ జగన్ భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవానికి ‘నవ రత్నాలు’ అమలుకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని జగన్ భావించారట. అయితే శాఖ కాకుండా ఇలా ప్రత్యేకంగా బాధ్యతలు కట్టబెడితే బాగుంటుందని జగన్ నిర్ణయించారట. అయితే ఇది ఎంత మాత్రం వర్కవుట్ అవుతుందో పైనున్న పెరుమాళ్లకే ఎరుక.
అంబటికి ఆ పదవి పక్కానా..!
సుమారు ముఫ్పై ఏళ్లకు పైగా అంబటి రాంబాబు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎన్నాళ్ల నుంచో అంబటి.. కోడెల కుటుంబంతో పోరాడుతూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో నాటి స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను అంబటి ఘోరంగా ఓడించి హిస్టరీ క్రియేట్ చేశారు. ఒకప్పుడు నరసరావుపేట, సత్తెనపల్లి అంటే టీడీపీ కంచుకోటలుగా.. కోడెల ఇలాఖాలుగా ఉండేవి.. అయితే ఈ ఎన్నికల ఫలితాలతో కంచుకోటలకు బీటలు వారగా.. ఇలాఖాల అడ్రస్ గల్లంతైపోయింది. బహుశా ఈ దెబ్బతో ఇక కోడెల రాజకీయ సన్యాసం తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే తాజాగా జరిగిన మంత్రి వర్గ ఏర్పాటులో ఈయనకు కచ్చితంగా మంత్రి పదవి వరిస్తుందని అంతా అనుకున్నారు.. కానీ దక్కలేదు. ఈయనకు నామినెటెడ్ పదవి కట్టబెట్టాలని జగన్ యోచిస్తున్నారు. ఏపీఐఐసీ చైర్మన్ (Andhra Pradesh Industrial Infrastructure Corporation) పదవికి అంబటి సరిగ్గా సరిపోతారని భావించిన జగన్.. త్వరలోనే ఈ పదవిలో కూర్చోబెట్టనున్నారని సమాచారం.
ఆళ్లకు దక్కే పదవి ఇదే..!
2014 ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో విజయం సాధించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. 2019 ఎన్నికల్లో ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌ను ఘోరంగా ఓడించి హిస్టరీ క్రియేట్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే నిజంగా ఇది రికార్డ్ బ్రేక్ చేయడమే. నాటి ముఖ్యమంత్రి తనయుడు.. మంత్రిగా పనిచేసిన లోకేష్‌ను ఎదుర్కోవాలంటే చాలా కష్టమే.. ఎందుకంటే వారి ఆర్థిక బలం అలాంటిది మరి. లోకేష్ ఈ ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ ఓట్లు మాత్రం ఆర్కేకే వేసి నియోజకవర్గ ప్రజలు ఊహించని రీతిలో.. కనివినీ ఎరుగనీ మెజార్టీతో గెలుపొందారు. అయితే కచ్చితంగా జగన్ ఈయన్ను కేబినెట్లోకి తీసుకుంటారని వ్యవసాయ శాఖ ఈయనే ఫిక్స్ అయ్యిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ‘రెడ్డి’ సామాజిక వర్గానికి అప్పటికే నలుగురు ఫిక్స్ అవ్వడంతో ఈయనకు ఇవ్వలేదు. చంద్రబాబుతో పాటు ఆయన తోక పత్రికలు.. మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం కోర్టుకు లాగిన హిస్టరీ ఈయనది. అయితే ఈయనకు ఫైనల్‌గా ‘గ్రామ సెక్రటేరియట్’ అమలు బాధ్యతలు మొత్తం ఆర్కేకు అప్పజెప్పాలని భావిస్తున్నారట. అయితే వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
ఇదే నిజమైతే.. ముగ్గురికి మూడు కీలక పదవులు వరించినట్లే.. అయితే కాస్త అటు ఇటు అయినా అతి త్వరలోనే వీరి ముగ్గురికీ నామినెటెడ్ పదవి మాత్రం పక్కా అని విశ్వసనీయ వర్గాల సమాచారం. జగన్ ఈ ముగ్గురి విషయంలో ఈ న్యాయం కచ్చితంగా చేయాలని ఆయా నేతల అభిమానులు, సొంత పార్టీ కార్యకర్తలు, నేతలుగట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ముగ్గరినీ ఏ మాత్రం పదవులు వరిస్తాయో..? ఈ వ్యవహారంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.