మీ కూతుళ్లను చూసి నేర్చుకోవాలి జగనన్నా: రోజా

  • IndiaGlitz, [Tuesday,July 23 2019]

మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళలకు చారిత్రాత్మక బిల్లులను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎమ్మెల్యే రోజా కృతజ్ఞతలు తెలిపారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదించిన విషయం విదితమే. ఈ సందర్భంగా రోజా అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఏపీలోని తమ ప్రభుత్వం ‘మహిళా పక్షపాతి ప్రభుత్వం’ అన్నారు. తనకు మొట్ట మొదట ఏపీఐఐసీ చైర్మన్‌ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని.. గత ప్రభుత్వం ఓట్ల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఓట్ల కోసం వాడుకుందని విమర్శలు గుప్పించారు.

మాటల్లో కాదు చేతల్లో..!

‘మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ‘ఆకాశంలో సగం, అవనిలో సగం’ అని అనేక సందర్భాల్లో అనేక మంది చెప్పారు కానీ.. మహిళలకు అవకాశాలు కల్పించింది జగన్ మాత్రమే అని నేను ఘంటాపథంగా చెబుతాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో సహా మహిళలందరికీ నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్ పనుల్లోనూ యాభై శాతం కేటాయించే బిల్లులను ప్రవేశపెట్టడం సంతోషకరం. ఇలాంటి చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. మహిళలకు అవకాశాలిస్తే రాణించగలరన్న నమ్మకంతో ఈ బిల్లులను జగన్ తీసుకొచ్చారు.. మహిళలందరూ కూడా సంతోషపడే విషయం అని రోజా చెప్పుకొచ్చారు.

జగనన్న కూతురే ఇందుకు నిదర్శనం!

మా నాయకుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అందులో పెద్దమ్మాయి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు సంపాదించి చదువుతున్నారు. అది ఎంత ప్రతిష్టాత్మకమైన కాలేజో, ఎలాంటి స్టూడెంట్స్ అక్కడ చదువుతారో మనందరికి తెలుసు. ఈ దేశంలోనే అతి తక్కువ మందికి దక్కే సీటును జగనన్న కూతురు దక్కించుకుని, ఆయన ప్రతిష్టను పెంచింది. మహిళలకు అవకాశమిస్తే ఎలా రాణిస్తారన్నది, ఆయన(జగన్) ఇంట్లో ఆయన పెద్దకూతురే నిరూపించారు. అది ఆయన ఆదర్శంగా తీసుకుని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్లను తన బిడ్డలా, చెల్లెలిలా, అక్కలా, తల్లిలా గౌరవిస్తూ, అన్నింట్లో సమాన అవకాశాలు ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పిన రోజా.. ఈ సందర్భంగా జగన్‌కు పాదాభివందనం చేస్తున్నానని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.