'రోగ్'తో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా వుంది - ఇషాన్
- IndiaGlitz, [Tuesday,March 28 2017]
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'చిరుత'తో హీరోగా పరిచయమైన రామ్‌చరణ్ ఇప్పుడు మెగా పవర్‌స్టార్‌గా స్టార్ హీరో ఇమేజ్‌ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. లేటెస్ట్‌గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'రోగ్' చిత్రంతో తెలుగు, కన్నడ భాషల్లో ఇషాన్ హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌గానీ, ట్రైలర్‌గానీ, పాటలుగానీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నాయి. ట్రైలర్‌లో ఇషాన్ పెర్‌ఫార్మెన్స్ చూసిన ప్రముఖులు భవిష్యత్తులో అతను స్టార్ హీరో అవుతాడని ప్రశంసించారు. 'రోగ్' చిత్రం ఉగాది కానుకగా మార్చి 31న తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరో ఇషాన్‌తో ఇంటర్వ్యూ..
'రోగ్'తో తెలుగు, కన్నడ భాషల్లో హీరోగా పరిచయమవుతున్నారు. ఎలా అనిపిస్తోంది?
చాలా ఎక్సైటింగ్‌గా వుంది. సేమ్ టైమ్ నెర్వస్‌గా కూడా వుంది. 'రోగ్' సినిమాతో నా కెరీర్ స్టార్ట్ అవుతోంది. నా డ్రీమ్ నిజం కాబోతోంది.
హీరో అవ్వాలని ముందు నుంచే అనుకున్నారా?
నేను హీరో అవ్వాలి అనుకున్న తర్వాత ఆ విషయాన్ని అన్నయ్యకి చెప్పాను. అన్నయ్య ఆల్‌రెడీ ప్రొడక్షన్‌లో వున్నారు కాబట్టి నేను చెప్పింది విన్న తర్వాత ఒకే మాట చెప్పారు. నువ్వు టాల్‌గా వున్నావు, లుక్స్ బాగున్నాయి. ఓకే. హీరో అవ్వడానికి ఈ క్వాలిఫికేషన్స్ ఒక్కటే చాలవు. యాక్టింగ్ నేర్చుకోవాలి, హార్డ్ వర్క్ చెయ్యాలి, డాన్స్, ఫైట్స్.. ఇలా అన్నీ నేర్చుకోవాలి అని చెప్పారు. తర్వాత ప్రొడక్షన్‌లో నాతో వర్క్ చేయించారు. సంవత్సరంన్నర మా ఓన్ బేనర్‌లో చేసిన సినిమాలకు ప్రొడక్షన్‌లో వర్క్ చేశాను. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. రెండు సినిమాలకు పనిచేసిన తర్వాత సత్యానంద్‌గారి దగ్గర కోచింగ్ తీసుకోవడానికి వైజాగ్ పంపించారు. సత్యానంద్‌గారు నన్ను బాగా ట్రైన్ చేశారు. అది పూర్తి కాగానే పూరి సర్‌తో మీటింగ్ ఎరేంజ్ చేశాను హైదరాబాద్ వచ్చెయ్యమని అన్నయ్య చెప్పారు.
ఫస్ట్ మూవీ పూరి జగన్నాథ్‌గారి డైరెక్షన్‌లో చెయ్యబోతున్నానని తెలిసిన తర్వాత మీరెలా ఫీల్ అయ్యారు?
అది నాకు షాకింగ్‌గానూ, సర్‌ప్రైజింగ్‌గానూ అనిపించింది. నా యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ అవ్వగానే నా డ్రీమ్ డైరెక్టర్ పూరి సర్ డైరెక్షన్‌లో సినిమా చెయ్యబోతున్నానని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను పూరిగారికి పెద్ద ఫ్యాన్‌ని. అలాంటిది ఆయన డైరెక్షన్‌లో నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు ఎంతో రుణపడి వుంటాను.
పూరి జగన్నాథ్ అంటే ఒక బ్రాండ్ వుంది. ఆయన సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా వుంటుంది. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుండబోతోంది?
పూరిగారి సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్ నాకు చాలా ఇష్టం. ఇడియట్, పోకిరి, లోఫర్.. ఇలా అన్ని సినిమాల్లోనూ హీరోగా చాలా డిఫరెంట్‌గా వుంటాడు. 'రోగ్'లో కూడా నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా వుంటుంది. ఖచ్చితంగా నా క్యారెక్టరైజేషన్ ఆడియన్స్‌కి నచ్చుతుంది. నాకు నా క్యారెక్టర్ ఎంత బాగా నచ్చిందో, విలన్ క్యారెక్టర్ కూడా అంతే నచ్చింది.
'రోగ్' ఎలాంటి సినిమా అని చెప్పొచ్చు?
ఇది ఒక డిఫరెంట్ మూవీ. డిఫరెంట్‌గా వుంటూనే ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో సాగే క్యూట్ లవ్‌స్టోరీ. కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్.
పూరి జగన్నాథ్ గురించి చెప్పండి?
నేను పూరిగారి డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నానని తెలిసిన రోజు నుంచి సర్ ప్రతిరోజూ నన్ను గైడ్ చేసేవారు. అంత పెద్ద డైరెక్టర్ నన్ను ఇంత బాగా చూసుకుంటారని అనుకోలేదు. ఈ కథ గురించి నాకు మూడుసార్లు ఎంతో డీటైల్డ్‌గా చెప్పారు. నీకు స్టోరీ నచ్చితేనే ఈ సినిమా చేద్దాం లేకపోతే వేరే స్టోరీతో వెళ్దాం అని నాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చేవారు. నన్ను హీరోగా చెయ్యడం కోసం మా పేరెంట్స్ ఎంతగా నన్ను ఎంకరేజ్ చేసారో.. పూరిగారు కూడా తన కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తే ఎంత కేర్ తీసుకుంటారో అంత కేర్ తీసుకున్నారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను.
సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఎలా అనిపించింది?
చాలా ఎక్స్‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ చాలా పెద్ద హిట్ అయ్యాయి. అలాగే విజువల్‌గా కూడా ఎంతో వండర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. ప్రతి పాటా ఎంతో డిఫరెంట్‌గా వుంటూ అందర్నీ ఆకట్టుకుంటాయి. భాస్కరభట్లగారు పాటల్ని అద్భుతంగా రాశారు. నా ఫస్ట్ మూవీకి ఇంత మంచి పాటలు రాసిన భాస్కరభట్లగారికి, మ్యూజిక్ చేసిన సునీల్ కశ్యప్‌గారికి థాంక్స్ చెప్తున్నాను. నేను థాంక్స్ చెప్పాల్సిన మరో వ్యక్తి ముఖేష్‌గారు. విజువల్‌గా ఎంతో అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దారు. అలాగే డైరెక్షన్ టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ, ఈ సినిమాకి పని చేసిన వారందరికీ ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు యంగ్ హీరో ఇషాన్.