‘రాకెట్రీ’ ట్రైలర్ రివ్యూ.. మాధవన్ జీవించేశాడుగా..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇస్రో లెజెండ్ నంబి నారాయణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత అంతరిక్ష పరిశోధన రంగం అభివృద్ధిలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో ఈయన ఒకరు. నంబి అంటే అప్పటికీ.. ఇప్పుటికీ గుర్తుండిపోయే లెజెండ్. అలాంటి నారాయణ్ ఒకానొక సమయంలో దేశ ద్రోహం కేసును ఎదుర్కొని... సుమారు 50రోజులకుపైగా జైల్లో గడిపారు. ఆ తర్వాత ఆయనపై వేసిన దేశ ద్రోహం కేసును సుప్రీం కొట్టి వేయడం జరిగింది. ఇలా ఒకట్రెండు కాదు.. ఆయన కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశారు. నంబి జీవితాన్ని ఆధారంగా చేసుకుని కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ ఈ కథను తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్’. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఓ తెలివైన సైంటిస్ట్ జీవితంలో పడిన అగచాట్ల సమాహారంగా తెరకెక్కిన చిత్రమే ‘రాకెట్రీ’ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో స్వయంగా మాధవనే ప్రధాన పాత్రలో నటించారు కూడా. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను గురువారం సాయంత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇంగ్లీష్, హిందీ, కన్నడ భాషల్లో షారుక్ ఖాన్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వగా.. తమిళ, మలయాళ, తెలుగు వర్షన్స్‌లో అదే పాత్రను తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య చేశాడు. ఈ సినిమాలో సీనియర్ నటి సిమ్రాన్ కూడా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు.
ట్రైలర్ రివ్యూ..
నంబి నారాయణ్ పాత్ర పోషిస్తున్న మాధవన్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న సన్నివేశంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూ వల్ల ఏ ఫలితం ఉండదనుకుంటే మీరెందుకని వచ్చారని నంబినారాయణన్‌ను బోర్డు మెంబర్ సూర్య అడుగగా.. ‘నేనెందుకు వచ్చానా.? నాకు జరిగింది ఈ దేశంలో మళ్లీ ఎవరికి జరుగకూడదు’ అని ని మాధవన్ చెబుతాడు. ‘ఓ వీధి కుక్కను కొట్టి చంపాలంటే దానికి పిచ్చి అనే పటం కడితే సరిపోతుంది. అదే విధంగా ఒక మనిషిని తలెత్తనివ్వకుండా కొట్టాలంటే దేశద్రోహి అనే పటం కడితే సరిపోతుంది’ అని సూర్య అంటాడు. ఇందుకు మాధవన్ స్పందిస్తూ.. ‘నేను ఒక క్యారెక్టర్ సర్టిఫికెట్ కోసమో.. పాపులారిటీ కోసమో రాలేదు.. ఒక మిషన్ కోసం వచ్చా’ అని బదులిస్తాడు. ఇలా వీరిద్దరి మధ్య జరిగిన ఇంటర్వ్యూ సంభాషణ చాలా ఆసక్తికరంగానూ.. సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేసింది. మొత్తానికి చూస్తే.. నారాయణన్ తన సర్వీసులు మొదలు పెట్టిన తొలినాళ్లలో గూఢచర్యానికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలు, వాటి పర్యావసానాలు ఎలా ఉన్నాయనే దానిపై సినిమాలో పెద్ద సస్పెన్స్ పెట్టారు. ట్రైలర్‌లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్, విజువలైజేషన్, ఎడిటింగ్ అదిరిపోయింది. మాధవన్ నటించడం కాదండోయ్.. నిజంగా జీవించేశాడు.
ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..
నిజంగా ఈ రేంజ్‌లో మాధవన్ నటించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. రియల్ లైఫ్‌లో ప్రముఖుల జీవితాలను తెరకెక్కించడంలో ముందుండే తమిళ ఇండస్ట్రీ ఓ మంచి ప్రయత్నాన్నే చేసిందని చెప్పుకోవచ్చు. మొన్నటికి మొన్న ‘ఆకాశమే హద్దురా’ సినిమా ఓ ప్రముఖ వ్యక్తి జీవితంలో జరిగిన సన్నివేశంతో తెరకెక్కించగా మంచి హిట్ అయ్యింది. తాజాగా నంబి నారాయణ్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. కెరీర్ పరంగా ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్న నంబి జీవితాన్ని ఆయన ఉండగానే మాధవన్ తెరకెక్కించడం విశేషం. చంద్రుడిని కమ్ముకున్న మబ్బులు తొలగిపోయినట్టు నంబి నారాయణన్ మీద ఆరోపణలూ చెదిరిపోయిన తర్వాత భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిందన్న విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments