Roar Of RRR: అంచనాలు తారాస్థాయికి.. మతిపోగొడుతున్న వీడియో!
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ పై అంచనాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి. అందుకు కారణం తాజాగా విడుదలైన రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో. మేకింగ్ విడియోతోనే ఎగ్జైట్మెంట్ ని డబుల్ చేసేశాడు రాజమౌళి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. యాక్షన్ ఎపిసోడ్స్ ఎంత భారీగా ఉండబోతున్నాయో అని.
మేకింగ్ వీడియోలో చూపించిన ఒక్కో షాట్ అబ్బురపరిచే విధంగా ఉంది. రాజమౌళి మార్క్ యాక్షన్, హీరోల ఇద్దరి సాహసోపేతమైన షాట్స్ మతిపోగొడుతున్నాయి. రాజమౌళి తన టీమ్ ని ఉపయోగించుకుంటూ నటీనటులతో అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబడుతున్నారు.
బాహుబలి తరహాలోనే భారీ సెట్స్ దర్శనమిస్తున్నాయి. బ్రిటిష్ టైం లో కట్టడాలు, ప్రజల వేషధారణ, పోలీస్ సెటప్ అంతా ఓ కొత్త ప్రపంచాన్ని తలపించే విధంగా ఉంది. ఎన్టీఆర్, రాంచరణ్ రోప్ వర్క్ తో చేస్తున్న యాక్షన్ ని మేకింగ్ వీడియోలో రాజమౌళి రుచి చూపించారు.
అడవులు తగలబెట్టడం, భారీగా మోహరించిన పోలీసులు.. ఈ సెటప్ అంతా చూస్తుంటే ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనే ఫీలింగ్ కలగక మానదు. మేకింగ్ వీడియోలో ప్రధాన నటీనటులందరినీ చూపించారు. ఎన్టీఆర్, చరణ్ తో పాటు అజయ్ దేవగన్, అలియా భట్, సముద్రఖని, శ్రీయ శరన్ కనిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్ లోరాప్ సింగర్ బాజ్లీ తన గాత్రంతో ఆకట్టుకుంటున్నాడు.
మేకింగ్ వీడియోలో చూపించిన భారీ పేలుళ్లు, ఫైర్ వర్క్ చూస్తుంటే ఎన్టీఆర్, చరణ్ చేయబోయే విధ్వంసం ఒక రేంజ్ లో ఉండబోతోందని అర్థం అవుతోంది. రాజమౌళి తన టీంతో ఎలా కష్టపడుతున్నాడు అనే అంశాలు కూడా మేకింగ్ వీడియోలో ఉన్నాయి.
అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకింగ్ వీడియోతో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీంగా, రాంచరణ్ అల్లూరిగా నటిస్తున్నారు. మేకింగ్ వీడియో రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పై మీరూ ఓ లుక్కేయండి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments