చేవెళ్లలో ఘోర ప్రమాదం.. ఆ చిన్నారిని చూసి స్థానికుల కంటతడి
Send us your feedback to audioarticles@vaarta.com
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు బోర్వెల్ను ఢీకొనడంతో డ్రైవర్ సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. మృతులంతా హైదరాబాద్ తాడ్బండ్ వాసులుగా గుర్తించారు. మల్కాపూర్ గేట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో 10 మంది ప్రయాణిస్తున్నారు. మృతులు ఆసిఫ్ ఖాన్(50), మహేష్ షనియా(18) నజియ బేగం(45), నజియ భాను(36) హర్ష (28) చిన్నారి హర్ష భాను(6)గా గుర్తించారు. మృత్యుంజయుడిగా చిన్నారి..
చేవెళ్ల రోడ్డు ప్రమాదం పొగమంచు కారణంగానే జరిగినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కారులోని వారంతా నిద్రలో ఉండగానే ఘోర ప్రమాదం జరిగిపోయింది. ఓ చిన్నారి మాత్రం ఒంటిపై గాయాలు కూడా లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ చిన్నారి కళ్లు తెరిచి చూసేసరికి తనవాళ్లందరూ రక్తమోడుతూ కనిపించారు. ఏం జరిగిందో తెలియదు. ఎలా జరిగిందో తెలియదు. చుట్టూ తన వాళ్ల శవాలు.. షాక్లో తల్లి శవానికి దగ్గరలో కూర్చుండిపోయాడు.
జరిగిన ఘోరాన్ని చూసి పసిప్రాణం అల్లాడిపోయింది. తాము వచ్చిన వాహనం నుజ్జు నుజ్జు అయిపోయింది. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆ ప్రదేశమంతా రక్తసిక్తంగా మారిపోయింది. భయంతో అమాయకంగా మొహం పెట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న బాలుడిని చూసి స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout