బద్ధ శత్రువులు కలిశారు.. ఖమ్మం ఎంపీ సీటు గెలుస్తారా!?

  • IndiaGlitz, [Sunday,March 24 2019]

ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ ఉద్ధండులు నామా నాగేశ్వరవు- తుమ్మల నాగేశ్వరరావు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వారిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. అయితే 2014 ఎన్నికల తర్వాత తుమ్మల టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకోగా.. నామా మాత్రం తెలుగుదేశంలోనే ఉండిపోయారు. విషయం ఏంటంటే 2018 ముందస్తు ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. నామా మాత్రం తెలుగుదేశంలోనే కొద్దిరోజులు ఉండి చివరికి తాజాగా కారెక్కేశారు. బాగా డబ్బులున్న వ్యక్తి.. పార్లమెంట్ ఎన్నికల్లో బాగా ఖర్చుపెట్టే వ్యక్తి గనుక పార్టీలో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది.

నామా కారెక్కడంతో తుమ్మల పరిస్థితి ఎలా ఉంటుందో అని అటు అనుచరులు, కార్యకర్తలు ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు నామా రాకను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు కూడా. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో నష్టపోయాం.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటివేమీ పునరావృతం కాకుండా చూడాలని కచ్చితంగా జిల్లాలో గులాబీ జెండా ఎగిరితీరాల్సిందేనని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నాటి బద్ధ శత్రువులు ఇద్దరూ.. మిత్రులై జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

కాగా ఆదివారం నాడు ఇద్దరూ ఒకే సభా వేదికగా ప్రత్యక్షమవ్వగా అటు నామా.. ఇటు తుమ్మల అభిమానులు, అనుచురల్లో ఆనందం అంతా ఇంతా కాదు. ఖమ్మం జిల్లా వైరాలో టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. మారిన రాజకీయ పరిస్థితుల్లో మనం కూడా మారాలని..
కేసీఆర్‌ ఎంపిక చేసిన అభ్యర్థి నామాను గెలిపించుకోవాలన్నారు. కలిసి పనిచేస్తే వైరాలోనే ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉందని తుమ్మల చెప్పుకొచ్చారు. రేపు అనగా సోమవారం నాడు నామినేషన్‌ కార్యక్రమంలో మన బలం ఎంతో చూపించాలని ఈ సందర్భంగా తుమ్మల పిలుపునిచ్చారు.

నామా మాట్లాడుతూ..

కేసీఆర్‌ తెలంగాణను అభివృద్ధిలో ముందువరుసలో నిలిపారు. 24 గంటల నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్న చరిత్ర దేశంలోనే లేదు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మీ ముందుకొచ్చా. దేశంలోనూ మార్పు తేవాలన్న ప్రయత్నాల్లో కేసీఆర్‌ ఉన్నారు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. కేంద్రం కూడా ఇక్కడి పథకాలను కాపీ కొడుతోంది. మన అందరి గ్రూప్‌ ఒక్కటే...అది కేసీఆర్‌ గ్రూప్‌ అని నామా నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో నామా గెలిచి నిలుస్తారో.. లేకుంటే మరోసారి ఓటమిని తన ఖాతాలో వేసుకుంటారో తెలియాలంటే ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే మరి.