'శివలింగ' చిత్రంలో నా పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకున్నా! - రితిక సింగ్
- IndiaGlitz, [Tuesday,April 11 2017]
డాక్టర్ కాబోయి యాక్టర్ అయినవాళ్లు.. ఇంజినీర్ కాబోయి యాక్టర్ అయినవాళ్లు ఉన్నారు. అదే తరహాలో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం నుంచి అనూహ్యంగా నటిగా అవకాశం అందుకుంది రితిక సింగ్. ఆరంభమే విక్టరీ వెంకటేష్ సినిమా 'గురు'లో కిక్‌బాక్సర్ పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం పి.వాసు దర్శకత్వంలో రాఘవలారెన్స్ సరసన 'శివలింగ' చిత్రంలో నటించింది. రెండు విభిన్నమైన సినిమాల్లో వైవిధ్యం ఉన్న పాత్రల్లో నటించానని రితిక చెబుతోంది. ఏప్రిల్ 14న 'శివలింగ' రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటిస్తూ రితిక చెప్పిన సంగతులివి...
స్వతహాగా నేను బాక్సార్‌ని. చిన్నపుడే బాక్సింగ్ నేర్చుకున్నా. ఏసియన్ బాక్సింగ్ ట్రోఫీలో విన్నర్‌గా నిలిచాను. ఆ క్రమంలోనే నన్ను చూసిన మ్యాడీ (మాధవన్) నాన్నగారిని సంప్రదించి తమిళచిత్రం 'ఇరుదుసుత్రు'లో అవకాశం ఇచ్చారు. వాస్తవానికి నేనుఎప్పుడూ నటి అవ్వాలనుకోలేదు. రియల్ లైఫ్‌లో మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌ని. అయితే ఇలా సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు. ప్రతిదీ అనుకోకుండా జరిగినదే. అనుకోకుండానే మ్యాడీ సర్నా.. నాన్నగారిని కలిసి బాక్సర్ రోల్ చేయాల్సిందిగా అడిగారు. ఆడిషన్స్ కి వెళ్లి సెలక్టయిపోయాను. ఆ సినిమా తమిళ్ హిందీలో సక్సెస్ సాధించింది. ఆ తర్వాత తెలుగులో వెంకటేష్ 'గురు'లోనూ ఛాన్స్ వచ్చింది.
'శివలింగ' చిత్రం కథ నచ్చి నటించాను. ముఖ్యంగా నా పాత్ర నన్ను ఆకట్టుకుంది. అందుకే ఇందులో నటించేందుకు ఒప్పుకున్నా. ఇదో హారర్ ఎంటర్‌టైనర్. కన్నడ వెర్షన్ 'శివలింగ' చూశాను. ఆ సినిమా ప్రభావం నాపై పడకుండా ఎంతో జాగ్రత్త తీసుకుని ఫ్రెష్‌గా నటించాను. గురు చిత్రంలో మేకప్ లేకుండా నటించాను. ఇందులో ఓ మామూలు అమ్మాయిగా నటించాలి. మేకప్ వేసుకున్నా. డ్యాన్సులు చేయడం, డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం చాలా కష్టంగా అనిపించింది. ఇదివరకూ నేనెప్పుడూ డ్యాన్సులు చేయలేదు. లారెన్స్ మాష్టార్ మంచి డ్యాన్సర్. డ్యాన్సులు అదరగొట్టేస్తారాయన. నాకేమో డ్యాన్సులు చాలా కష్టం. దీనికితోడు శారీలో కనిపించాలి. శారీలోనే డ్యాన్సులు చేయాలి. అది ఇంకా పెద్ద సవాల్ అనిపించింది. మొత్తానికి ఈ చిత్రం చాలా పెద్ద ఛాలెంజింగ్ అనిపించింది. డ్యాన్సులు చేసేప్పుడు బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ పై లారెన్స్ మాష్టార్ సలహాలు ఇచ్చారు. ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా ఉంటాయి.
బాక్సింగ్‌తో పోలిస్తే యాక్టింగ్ చాలా కష్టం. చిన్నప్పటినుంచి మార్షల్ ఆర్ట్స్ , బాక్సింగ్ నేర్చుకున్నా. అవి చేయడం ఈజీ. కానీ నటన కష్టం. కొత్త అవ్వడం వల్లనే ప్రతిదీ కష్టం అనిపించింది. శివలింగ సినిమా చేసేప్పుడు యాక్షన్ ఎపిసోడ్స్, డ్యాన్సుల కోసం ఎక్కువ శ్రమించాల్సొచ్చింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 వరకూ ప్రాక్టీస్ చేసేదాన్ని.
గురు చిత్రంలో వెంకటేష్, సాలా ఖుడూస్‌లో మాధవన్ తో కలిసి నటించాను. ఆ ఇద్దరూ అమేజింగ్ యాక్టర్స్. అన్నిరకాలుగా సపోర్ట్ చేశారు. ఎన్నో విలువైన విషయాలు వారి నుంచి నేర్చుకున్నా. గురు చిత్రంతో తెలుగులో ప్రవేశించడం ఆనందంగా ఉంది. వెంకటేష్ గారు ఈ చిత్రంలో నటించేందుకు నాకు ఎంతో సాయం చేశారు.
ప్రస్తుతం తెలుగులో కథలు వింటున్నా. మంచి అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధమే. కెరీర్‌లో వైవిధ్యం ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నా. నటనకు ఆస్కారం ఉండేవి ఎంపిక చేసుకుంటా. తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నా.
ప్రియాంక చోప్రా, ఆలియాభట్, అనుష్క శర్మ నా అభిమాన తారలు. వీళ్లంతా నాకు ఇన్‌స్పిరేషన్. వీళ్లంతా చిన్నవయసులో ఎంతో ఇన్‌స్పయిరింగ్‌గా ఎదిగిన తీరు నన్ను ఆలోచింపజేస్తుంది.