తగ్గిపోతున్న టీడీపీ కూటమి గ్రాఫ్.. దూసుకుపోతున్న వైసీపీ..
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా 30 రోజులు సమయం ఉంది. ఇప్పటికే 'మేమంతా సిద్ధం' పేరుతో సీఎం వైయస్ జగన్ చేస్తున్న బస్సు యాత్రకు భారీ స్పందన వస్తుంది. దీంతో వైసీపీ కేడర్‌లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ కూటమిలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో సీట్ల ఎంపిక జరగలేదు. నిత్యం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. పోలింగ్‌కు నెల రోజులు సమయం మాత్రమే ఉన్నా ఇప్పటికీ కూటమి నేతలు కేడర్‌కు భరోసా ఇవ్వలేకపోతున్నారు. జనసేకు కేటాయించిన 21 సీట్లలో అభ్యర్థుల ఎంపికతో పాటు బీజేపీకి కేటాయించిన సీట్లపైనా నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
సీట్ల సర్దుబాటు, ఎంపికలోనే లుకలుకలు..
రెండు పార్టీల్లోనూ వలస వచ్చిన నాయకులకే టికెట్లు ఇవ్వడంపై తొలి నుంచి పార్టీల్లో ఉన్నవారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారంతా టికెట్ దక్కించుకున్న వారికి సహకరిస్తారన్న నమ్మకం లేదు. దీనికి తోడు టీడీపీ ఓట్లు జనసేన, బీజేపీకి వేసే పరిస్థితి కనిపించడం లేదు. అలాగని టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నచోట్ల ఆ రెండు పార్టీల ఓట్లు కూడా ట్రాన్ఫర్ అవుతాయన్న ధీమా కూటమి నేతల్లో లేదు. పైకి మూడు పార్టీలు కూటమి కట్టినా.. స్థానిక నాయకత్వం మాత్రం ఇప్పటికీ పొత్తును పూర్తిస్థాయిలో అంగీకరించడం లేదు.
బాబు, పవన్ ప్రచారానికి దక్కని ఆదరణ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తే కలిసొచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ పవన్ ఎక్కువగా తాను పోటీ చేస్తున్న పిఠాపురంలోనే ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. తొలుత ఈ నియోజకవర్గంలో తన గెలుపు నల్లేరు మీద నడకే అని భావించిన పవన్ కళ్యాణ్‌కు అసలు విషయం బోధపడినట్టుంది. అక్కడ రోజురోజుకు పవన్ గ్రాఫ్ తగ్గుతోంది. దీంతో గెలుపు భారమంతా టీడీపీ నేత వర్మపైనే పెట్టేశారు. ఆయనకు తోడు తనకు మద్దతుగా ప్రచారం కోసం కొంతమంది జబర్దస్త్ షో కమెడియన్లను రప్పించుకున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రజాగళం సభలకు కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. బాబు ప్రసంగంలో ఎంతసేపూ జగన్‌ను విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు నేను ఇది చేశాను అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది కూడా టీడీపీ గ్రాఫ్ తగ్గడానికి కారణం అంటున్నారు.
సీఎం జగన్ బస్సు యాత్రతో క్యాడర్‌లో ఫుల్ జోష్..
కూటమి సంగతి ఇలా ఉంటే.. అధికార వైయస్ఆర్‌సీపీలో మాత్రం ఫుల్ జోష్ కనిపిస్తోంది. సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రకు వస్తున్న ఆదరణతో మొన్నటి వరకు కొంత వ్యతిరేకత ఉందన్న భావన కూడా ఇప్పుడు పూర్తిగా అనుకూలంగా మారిపోతోంది. ఉమ్మడి రాయసీలమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు దాటి గుంటూరుకు చేరిన జగన్ యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఉభయగోదావరి జిల్లాలపై పడింది. జగన్ యాత్ర చేసే నాటికి ఇక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా మారతాయని వైసీపీ కేడర్ ధీమాగా ఉంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ సాధించిన సీట్లకు కొంచెం అటూ ఇటుగా ఈసారి కూడా రావడం ఖాయమన్న భరోసా నేతల్లో కనిపిస్తోంది. మొత్తానికి కూటమి నేతలు ప్రచారంలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. వైసీపీ మాత్రం దూసుకుపోతోంది. దీంతో మరోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com