Rishi Sunak : బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్... ఇంగ్లీష్ గడ్డను ఏలనున్న భారత సంతతి బిడ్డ ..!!
Send us your feedback to audioarticles@vaarta.com
బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెజారిటీ ఎంపీలు ఆయన నాయకత్వంపై నమ్మకం వుంచడంతో ఎలాంటి పోటీ లేకుండా రిషి అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. తొలుత బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆ తర్వాత పెని మౌర్డౌంట్‌లు పోటీ ఇస్తారని అంతా భావించారు. కానీ వారిద్దరూ అనూహ్యంగా రేసులో నుంచి తప్పుకోవడంతో రిషికి మార్గం సుగమమైంది. దీంతో బ్రిటన్ ప్రధానిగా ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. బ్రిటన్ ఇప్పుడున్న పరిస్ధితుల్లో దేశాన్ని గాడిలో పెట్టగల సత్తా రిషికి మాత్రమే వుందని.. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. అందుకే ఆయనకు మద్ధతుగా నిలిచేందుకు పోటీపడ్డారు.
ఇదీ రిషి సునాక్ ప్రస్థానం:
ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో 1980 మే 12న రిషి సునాక్ జన్మించారు. తల్లిదండ్రులు ఉష, యశ్‌వీర్. వీరిద్దరి మూలాలు భారతదేశంలోని పంజాబ్‌లో వున్నాయి. వీరు టాంజానియా, కెన్యాలలో కొన్నాళ్లు వున్న తర్వాత బ్రిటన్‌కు వలస వచ్చారు. సునాక్ తండ్రి యశ్‌వీర్ మంచి డాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకోగా.. తల్లి మెడికల్ షాపు నిర్వహించేవారు. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, ఎకనామిక్స్ చదువుకున్న రిషి సునాక్ తర్వాత గోల్డ్ మాన్ శాచ్స్‌లో పనిచేశారు. అలాగే రెండు హెడ్జ్ ఫండ్స్ పార్ట్‌నర్‌గానూ వున్నారు. ఈ సమయంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తితో పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
రాజకీయాల్లోకి అలా :
చిన్నప్పటి నుంచే రిషికి రాజకీయాలపై ఆసక్తి వుంది. ఈ క్రమంలోనే చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్ పార్టీలో ఇంటర్న్‌షిప్ చేశారు. 2014లో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 2015లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రిచ్‌మాండ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2017, 2019 ఎన్నికల్లోనూ వరుసగా గెలుపొందారు. 2019లో ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఎన్నికవ్వడంతో రిషికి ఆర్ధిక శాఖలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. కరోనా సమయంలో తన అద్భుత పనితీరుతో రైజింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రిషి. ఈ క్రమంలో 2020 ఫిబ్రవరిలో ఛాన్సలర్‌గా పదోన్నతి కల్పించారు బోరిస్. తర్వాత పార్టీ గేట్ వివాదంలో జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో తదుపరి ప్రధాని ఎవరన్న సమయంలో రిషి సునాక్ పేరు మారుమోగింది. కానీ అనూహ్యంగా లిజ్ ట్రస్ అవకాశం దక్కించుకున్నారు.
భారతీయ మూలాలను మరిచిపోని రిషి సునాక్:
రిషి హిందూ కుటుంబంలో జన్మించడంతో చిన్నప్పటి నుంచి ఆలయాలను సందర్శించేవారు. ఆయన తాతగారు రామ్ దాస్ సునాక్ ఆలయ స్థాపక సభ్యుడు కావడంతో సౌతాంప్టన్‌లోని హిందూ వైదిక సమాజం ఆలయం అంటే రిషి ఎంతో ఇష్టపడేవారు. అంతేకాదు పార్లమెంట్‌లో ఎంపీగా భగవద్గీతపై ప్రమాణం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments