వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోలేని టీమిండియా ఆటగాళ్లు అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లకు బుధవారం నాడు బీసీసీఐ శుభవార్త చెప్పింది. రిషబ్, రాయుడితో పాటు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న నవదీప్ షైనీని వరల్డ్‌కప్ జట్టులో స్టాండ్‌బై ఆటగాళ్లుగా తీసుకుంటున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎంపికైన 15 మందిలో ఎవరైనా గాయపడితే వీరు ఇంగ్లాండ్‌కు హుటాహుటిన పయనమవుతారన్న మాట.
కాగా.. పంత్, రాయుడుని ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంతో సెలక్టర్లపై క్రీడాభిమానులు, క్రీడా విశ్లేషకులు, నెటిజన్లు.. ముఖ్యంగా మాజీ క్రికెటర్లు బీసీసీఐపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఆ ఇద్దరు ఆటగాళ్లకు సునిల్ గవాస్కర్, గౌతమ్ గంభీర్ సహా మరికొందరు మాజీలు అండగా నిలవడంతో కాస్త తగ్గిన బీసీసీఐ ముందు చూపుతో ఆ ఇద్దర్నీ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో క్రీడాభిమానులు.. రిషబ్, రాయుడు అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
ఎలాంటి సందేహాల్లేవ్..
ఈ విషయమై బీసీసీఐ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ఐసీసీ చాంపియన్ ట్రోఫీ సందర్బంగా అవలంబించిన పద్దతినే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం. పంత్, రాయుడు, సైనీలను స్టాండ్ బై ప్లేయర్స్‌గా ఎంపిక చేశాము. ప్రస్తుతం జట్టులో ఎవరైన గాయపడితే వారికే తొలి అవకాశం ఇస్తాం.. ఇందులో ఎలాంటి సందేహాల్లేవ్. నెట్ ప్రాక్టీస్‌లో బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేసేందుకు ఖలీల్, ఆవేశ్ ఖాన్, దీపక్ చాహర్‌లను ఎంపికచేశాం. ఈ ముగ్గురు బౌలర్లు టీమిండియాతో కలిసి ఇంగ్లండ్‌కు వెళతారు. కానీ వీరు స్టాండ్ బై ప్లేయర్స్ కాదు అని ఆయన చెప్పుకొచ్చారు.