'రైట్ రైట్' మేకింగ్ వీడియో విడుదల
- IndiaGlitz, [Tuesday,May 10 2016]
తెలుగు పరిశ్రమలో వరుస ఘన విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న స్టార్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు చేతుల మీదుగా క్యూట్ హీరో సుమంత్ అశ్విన్ నటించిన 'రైట్ రైట్' మేకింగ్ వీడియో విడుదలైంది. మంగళవారం ఎం.ఎస్.రాజు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆయన చేతుల మీదుగా 'రైట్ రైట్' యూనిట్ తమ చిత్ర మేకింగ్ వీడియో ఆవిష్కరించారు.
సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'రైట్ రైట్'. మలయాళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న 'ఆర్డినరీ' చిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పిస్తున్నారు. మను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్నారు. సుమంత్ అశ్విన్ సరసన పూజా జవేరి నాయికగా నటించారు. బాహుబలి' ఫేమ్ ప్రభాకర్ కీలక పాత్ర పోషించారు.ఈ సందర్భంగా
ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ ''సుమంత్ అశ్విన్ ఈ మధ్య క్యూట్ చిత్రాలు చేసుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా తను నటిస్తున్న 'రైట్ రైట్' అతను కెరీర్లో చెప్పుకునే చిత్రమవుతుంది. మేకింగ్ వీడియో చూస్తుంటే ప్రామిసింగ్‌గా ఉంది. యూనిట్ ఎంత నిబద్ధతతో, లీనమై సినిమా చేశారో అర్థమైంది. టీమ్ అందరికీ ఈ చిత్రం పెద్ద హిట్ ను తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను'' అని తెలిపారు.
సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ ''నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా మేకింగ్ వీడియో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన అభిరుచి గల నిర్మాత అనే విషయం జగమెరిగినదే. 'రైట్ రైట్' తప్పకుండా మంచి సినిమా అవుతుంది. మా దర్శకుడు మనుకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ చిత్రంతో 'బాహుబలి'లో అందరినీ భయపెట్టిన ప్రభాకర్ నాకు మంచి మిత్రుడయ్యారు'' అని చెప్పారు.
నిర్మాత జె.వంశీకృష్ణ మాట్లాడుతూ ''ఈ నెల 15న పాటలను విడుదల చేస్తాం. జె.బి.చాలా మంచి సంగీతాన్నిచ్చారు. ప్రస్తుతం రీరికార్డింగ్ చేస్తున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఎం.ఎస్.రాజుగారి చేతుల మీదుగా మా చిత్ర మేకింగ్ వీడియో విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఆయన ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచారు. ఎస్.కోట నుంచి గవిటికి వెళ్లే ఓ ఆర్టీసీ బస్సు ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. కామెడీ, లవ్, మిస్టరీ అంశాలతో ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇది'' అని చెప్పారు.
సంగీత దర్శకుడు జె.బి. మాట్లాడుతూ ''మా చిత్రం ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఇటీవలే ఫస్టాఫ్ రీరికార్డింగ్ పూర్తయింది'' అని అన్నారు.
దర్శకుడు మను మాట్లాడుతూ - ''మలయాళం 'ఆర్డినరీ' సినిమా స్ఫూర్తితో తెరకెక్కిస్తున్నాం. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు, చేర్పులు చేశాం. ఇందులో 'బాహుబలి' ప్రభాకర్ డ్రైవర్‌గా, సుమంత్ అశ్విన్ కండక్టర్‌గా కనిపిస్తారు. 'సుమంత్ అశ్విన్ కెరీర్‌లో మంచి సినిమా అవుతుంది. 'లవర్స్', 'కేరింత' సినిమాల సక్సెస్‌లో ఉన్న ఆయనకు ఈ సినిమా గుర్తుండిపోతుంది. నాజర్ చాలా అద్భుతమైన పాత్రను పోషించారు. తొలి సగం వినోదాత్మకంగా సాగుతుంది. మలి సగంలో మిస్టరీ ఉంటుంది. ఔట్‌పుట్ బాగా వచ్చింది. సుమంత్ అశ్విన్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది'' అని అన్నారు.
నాజర్, ధనరాజ్, 'షకలక' శంకర్, తాగుబోతు రమేశ్, జీవా, రాజా రవీంద్ర, భరత్‌రెడ్డి, వినోద్, పావని, కరుణ, జయవాణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జె.బి., పాటలు: శ్రీమణి, కెమెరా: శేఖర్ వి.జోసఫ్, మాటలు: 'డార్లింగ్' స్వామి, ఆర్ట్ : కె.ఎమ్.రాజీవ్, కో ప్రొడ్యూసర్: జె.శ్రీనివాసరాజు, నిర్మాత: జె.వంశీకృష్ణ, దర్శకత్వం: మను, సమర్పణ: వత్సవాయి వెంకటేశ్వర్లు.