దాసరి చేతుల మీదుగా రైట్ రైట్ ఆడియో విడుదల
- IndiaGlitz, [Monday,May 16 2016]
సుమంత్ అశ్విన్, ప్రభాకర్, పూజా జవేరి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం రైట్ రైట్. ఈ చిత్రాన్ని మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్నారు. జె.బి సంగీతం అందించిన రైట్ రైట్ ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ పార్క్ హయత్ లో సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకరత్న దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై రైట్ రైట్ ఆడియో బిగ్ సీ.డీ, ఆడియో సీ.డీ లను ఆవిష్కరించి...తొలి సి.డీను వి.వి.వినాయక్, ఎం.ఎస్.రాజు కు అందించారు.
ఈ సందర్భంగా గీత రచయిత శ్రీమణి మాట్లాడుతూ...రైట్ రైట్ మూవీకి సింగిల్ కార్డ్ రాయడం సంతోషంగా ఉంది. ఎం.ఎస్ రాజు గారు ఈ చిత్రంలోని ప్రతి పాటను అభినందిస్తూ ఇచ్చిన కాంప్లిమెంట్ ను మరచిపోలేను. జె.బి. మంచి ట్యూన్స్ అందించారు. అలాగే... డైరెక్టర్ మను ప్రతి సన్నివేశాన్ని వివరించి మంచి పాటలు రాసేలా ఎంతగానో సహకరించారు. ఈ చిత్రానికి సింగిల్ కార్డ్ రాసే అవకాశం కల్పించిన ఎం.ఎస్.రాజు గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
రచయిత డార్లింగ్ స్వామి మాట్లాడుతూ...నిర్మాత వంశీకృష్ణ ఏమాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో సూపర్ హిట్ సాధించి వంశీకృష్ణ పెద్ద నిర్మాత అవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగు, తమిళ్, మలయాళంలో రూపొందిన దృశ్యం చిత్రానికి ఈ మూడు భాషల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన మను ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మను టాలెంట్.. ఎం.ఎస్ రాజు గారి అనుభవంతో ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది. సుమంత్ పాత్రకు తగ్గట్టు చాలా బాగా నటించారు. జె.బి సంగీతం అందించిన అన్ని సినిమాలు దాదాపు హిట్ అయ్యాయి. ఈ మూవీకి కూడా హిట్ అయి రైట్ రైట్ టీమ్ కి మంచి పేరు తీసుకువస్తుంది అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...మా బ్యానర్ లో సుమంత్ అశ్విన్ తో నిర్మించిన కేరింత సక్సెస్ అయ్యింది. రైట్ రైట్ కూడా సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాను. బాహుబలితో ప్రభాకర్ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. ఈ చిత్రంతో ప్రభాకర్ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతాడు అన్నారు.
డైరెక్టర్ మను మాట్లాడుతూ...ఇండస్ట్రీలో నేను ఫస్ట్ కథ ఎం.ఎస్ రాజు గారికే చెప్పాను. ఇప్పుడు ఎం.ఎస్.రాజు గారబ్బాయి సుమంత్ తో రైట్ రైట్ సినిమా చేయడం సంతోషంగా ఉంది. డ్రైవర్ - కండక్టర్ కు మధ్య జరిగే కథే ఈ సినిమా. సుమంత్ చాలా బాగా నటించాడు. టీమ్ అంతా కలిసి చాలా హార్డ్ వర్క్ చేసాం. మా కష్టానికి తగ్గట్టు మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.
సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ...ప్రతి పాట చాలా క్యాచీగా ఉంది. విజువల్స్ రిచ్ గా కనిపిస్తున్నాయి. డైరెక్టర్ మనులో టాలెంట్ కనిపిస్తుంది. సుమంత్ అశ్విన్ కి మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ...బాహుబలి ప్రభాకర్ ఈ మూవీతో నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ కోసం ప్రభాకర్ చాలా కష్టపడ్డాడు. మంచి టెక్నీషియన్స్ తో వర్క్ చేసినందుకు సంతోషంగా ఉంది. క్షణం, ఊపిరి...ఇలా కొత్త కాన్సెప్ట్స్ తో సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న మా సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ...ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా గుర్తొస్తుంది. రైట్ రైట్ సక్సెస్ అవ్వాలి..టీమ్ అందరికీ మంచి పేరు రావాలి అన్నారు.
దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ...ఈ సినిమా పాటలు ముందే విన్నాను. ఈమధ్య కాలంలో ఇంత మెలోడియస్ మ్యూజిక్ తో ఉన్న సినిమాలు రాలేదు. ఖచ్చితంగా ఈ సినిమా పాటలు సక్సెస్ అవుతాయి. సుమంత్ పక్కింటి కుర్రాడులా కనిపిస్తాడు. హీరోకి కావాల్సిన బాడీ లాంగ్వేజ్ తనలో ఉంది. డాన్స్ అద్భుతంగా చేస్తున్నాడు. ఈ చిత్రంలో పెర్ ఫార్మెన్స్, డాన్స్ చేయడంతో పాటు మంచి పాత్రలో నటించాడు. హీరోలకు అలాంటి పాత్ర దొరకడం చాలా అరుదు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ చూసాను. తన నటనతో సుమంత్ ఆకట్టుకున్నాడు. విలన్ పాత్రలు చేసే వాళ్లు సెన్సిటివ్ గా ఉంటారు. ఈ చిత్రంలో నటించిన ప్రభాకర్ ను స్టేజ్ పై చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణతో విజయం సాధిస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, బెల్లంకొండ సురేష్, అడ్డాల చంటి, ఎస్.గోపాల్ రెడ్డి, డైరెక్టర్స్ బి.గోపాల్, ఎ.కోదండరామిరెడ్డి, సాయికిరణ్ అడవి, సీనియర్ నరేష్, సింగర్ మాలతి, మ్యూజిక్ డైరెక్టర్ జె.బి తదితరులు పాల్గొన్నారు.