Vyooham Review: అభిమానులకు మాత్రం పండగే.. ఆర్జీవీ 'వ్యూహం' ఎలా ఉందంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిన చిత్రం ‘వ్యూహం’. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఎన్నో వివాదాలను దాటుకుని ఎట్టకేలకు ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా కథ ఏమిటనేది తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరికీ తెలిసిందే. దానికే తనదైన టేకింగ్ జోడించి సినిమాను తీశారు ఆర్జీవీ. అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్, వాసు ఇంటూరి, సురభి ప్రభావతి, ఎలీనా టుటేజా, ధనంజయ్ ప్రభునే తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ప్రేక్షకులను ఆకట్టుకుందా..?
దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండో సారి సీఎం అయిన కొద్ది రోజులకే హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోతారు. ఆయన మరణం దగ్గరి నుంచి కథ మొదలై.. వైఎస్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ ముఖ్యమంత్రి అవ్వడంతో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో జగన్ జీవితంలో జరిగిన సంఘటనలను ఇందులో చూపించారు. ఓ పార్టీ అభిమానులే టార్గెట్గా తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? అసలు సినిమా ఎలా ఉంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి..
తండ్రి అడుగుజాడల్లో నడవాలని రాజకీయాల్లోకి వచ్చిన జగన్ పాత్రదారి.. తొలి ఎన్నికల్లోనే కడప ఎంపీగా విజయం సాధిస్తారు. అనంతరం హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ పాత్రదారి మరణిస్తారు. ఆ సమయంలో జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ 150 మందికి పైగా ఎమ్మెల్యులు సంతకాలు చేసి ఒక లేఖను కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాకు అందజేస్తారు. అయితే జగన్ సీఎం కాకుండా చంద్రబాబు పాత్రదారి ఎందుకు అడ్డుకున్నారు. ఆ తర్వాత తనపై జరిగిన కుట్రలను ఆయన ఎలా ఎదుర్కొన్నారనేది చక్కగా చూపించారు.
అభిమానుల ఈలలు
ఇక జైలుకు వెళ్లినప్పుడు, తర్వాత కష్ట సమయంలో తల్లి విజయమ్మ, భార్య భారతి అండగా నిలిచే సన్నివేశాల్లో భావోద్వేగాలు పండించారు. అలాగే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, చిరంజీవిపై పరిమితికి మించి సెటైర్లు వేశారు. ఇవి వారి అభిమానులకు అంతగా మింగుడుపడవు. అదే సమయంలో రావాలి జగన్.. కావాలి జగన్ వంటి పాటలు వైసీపీ అభిమానుల చేత ఈలలు వేయిస్తాయి. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం కార్యక్రమంతో సినిమా ముగుస్తుంది. సీఎం అయిన తర్వాత జరిగిన పరిణామాలతో దీనికి సీక్వెల్గా శపథం సినిమా రానుంది.
వైసీపీ వీరాభిమానులకు..
ఈ కథ మొత్తం ప్రేక్షకులకు ముందే తెలియడంతో కథనంపై పెద్ద ఆసక్తి ఉండదు. తర్వాత ఏం జరగబోతుందే ముందే ఊహించవచ్చు. 2014 ఎన్నికల్లో తాను ఓడిపోతానని జగన్కు ముందే తెలుసునని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ ఆర్టిస్టుల ఎంపికలో వర్మ మరోసారి తన పట్టు చూపించారు. చంద్రబాబు, పవన్, చిరు, నాగబాబు, రోశయ్య, సోనియా తదితర పాత్రలకు ఆయా వ్యక్తుల రూపాన్ని పోలిన నటీనటుల్ని పెట్టారు. ముఖ్యంగా చంద్రబాబు మేనరిజమ్స్ అచ్చు గుద్దినట్లు చూపించారు. జగన్ పాత్ర పోషించిన అజ్మల్ అమీర్ అయితే నటించాడు అని చెప్పడం కంటే జీవించాడు అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా జగన్, వైసీపీ వీరాభిమానులకు మాత్రం ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout