ప్రమోషన్ కోసం..'శివ'ను వాడుకోనున్న వర్మ
- IndiaGlitz, [Tuesday,February 13 2018]
నాగార్జున, రాంగోపాల్ వర్మ పేర్లు చెబితే ఠక్కున గుర్తుకొచ్చేది 'శివ' చిత్రం. 28 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. 'శివ' పేరు చెబితే పోస్టర్లో ఆ పేరు పై నుంచి చేతితో సైకిల్ చైన్ పట్టుకున్న దృశ్యం గుర్తుకొస్తుంది. అలాగే మొదటి ఫైట్ సన్నివేశంలో.. నాగ్ సైకిల్ చైన్ తెంపే సీన్ కళ్ళ ముందు కదలాడుతుంది.
తెలుగు సినీ చరిత్రలో ఒక అధ్యాయాన్ని లిఖించిన చిత్రమిది. రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ ని సైతం షేక్ చేసిన మూవీ 'శివ'. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ నెల 18న హైదరాబాద్‌లోని పీవీఆర్‌లో 'శివ' సినిమాని వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది చిత్ర యూనిట్. ఈ షోకి నాగార్జునతో పాటు అమల, వర్మ, అక్కినేని అభిమానులు కూడా హాజరవుతున్నారని సమాచారం.
ఇదిలా వుంటే..నాగ్, వర్మ కాంబినేషన్లో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'శపథం', 'గన్', 'సిస్టమ్' అనే పేర్లు పరిశీలనలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కోసం.. 'శివ' సినిమా స్పెషల్ షోను వర్మ వాడుకోనున్నట్లు తెలుస్తోంది. మైరా సరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వర్మ స్వయంగా నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.