నెపోటిజంకు వ‌ర్మ మ‌ద్ద‌తు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్యతో బాలీవుడ్ వ‌ర్గాలు షాక్ అయ్యాయి. సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి నెపోటిజ‌మే కార‌ణ‌మ‌ని నెటిజ‌న్లు, కొంద‌రు బాలీవుడ్ సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాలో నెపోటిజ‌మ్‌పై విరుచుకుప‌డుతున్నారు. ముఖ్యంగా క‌ర‌ణ్‌జోహార్, ఆలియా భ‌ట్‌ల‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న‌దైన శైలిలో స్పందించారు. వ‌ర్మ నెపోటిజంకు మ‌ద్ద‌తుగా వ‌రుస ట్వీట్స్ చేయ‌డం విశేషం.

‘‘సుశాంత్ సింగ్ మృతి విష‌యంలో క‌ర‌ణ్‌జోహార్‌ను విమ‌ర్శించ‌డం చూస్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. సినీ ప‌రిశ్ర‌మ ఎలా ఉంటుంద‌నేది ఎవ‌రికీ తెలియ‌డం లేదు. అలా తెలియ‌క‌నే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సుశాంత్ సింగ్‌తో క‌ష్టం అనుకున్న‌ప్పుడు అత‌నితో ప‌నిచేయాలా? వద్దా? అని నిర్మాత‌లు సొంతంగా నిర్ణ‌యించుకుంటారు. ఇందులో క‌ర‌ణ్‌ని త‌ప్పు పట్టాల్సిన ప‌నిలేదు. మంచి పేరు, డ‌బ్బు, 12 సంవ‌త్స‌రాల త‌ర్వాత కూడా నేను ఇండ‌స్ట్రీ వ్య‌క్తిని కాదు అని ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటే.. సుశాంత్ స్థాయి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న వారిలో కనీసం 100 అయినా రోజూ చ‌నిపోవాలి. ములాయం సింగ్ యాద‌వ్‌, ఉద్ధ‌వ్ థాక్రే త‌మ వార‌స‌త్వానికి ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్లు ముఖేష్‌, అనీల్‌ల‌కు ధీరూభాయ్ ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లు అన్నీ చోట్ల త‌మ వారు అనుకున్న‌వారికే ప్రాధాన్య‌త ఇస్తారు. బాలీవుడ్‌లోనూ అంతే. బంధుప్రీతి లేనిది ఎక్క‌డ‌? ఇప్పుడు ఇన్‌సైడ‌ర్స్ అని అనుకుంటున్న అమితాబ్‌, క‌ర‌ణ్‌జోహార్‌లాంటి వాళ్లు కూడా ఒక‌ప్పుడు అవుట్ సైడ‌ర్సే. ఇన్‌సైడ‌ర్ అనే కారణంతో ల‌క్ష‌లాది మంది సినిమాలు చూశార‌నుకుంటే స‌రికాదు. ఇండ‌స్ట్రీ నుండి సుశాంత్‌ను బ‌య‌ట‌కు పంపించ‌డానికి ఎంత మంది ప్ర‌య‌త్నించార‌నేది లెక్క కాదు. అదే స‌మ‌యంలో సుశాంత్‌తో వ‌ర్క్ చేయ‌డానికి ఎంత మంది రెడీగా ఉన్నారు ఎవ‌రితో ఎవ‌రు ప‌నిచేయాలి? అనేది వారి ఇష్టాల‌ను బ‌ట్టి జ‌రుగుతుంది’’ అని తెలిపారు ఆర్జీవీ.