ఆర్జీవీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కు బ్రేక్ పడనుందా..!?
- IndiaGlitz, [Tuesday,January 22 2019]
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ చిత్రానికి వైసీపీ నేత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా టైటిల్ పెట్టినప్పట్నుంచి నేటి వరకూ అన్నీ వివాదాలే.. సంచలనాలే. ఇలా రోజుకో వివాదాన్ని ఆర్జీవీ చవిచూడాల్సి వస్తోంది. ఇప్పటికే వర్మ రిలీజ్ చేసిన సాంగ్స్, ఫస్ట్ లుక్‌లు తీవ్ర వివాదాస్పదమవ్వడంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎన్నికల టైమ్‌లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా వల్ల టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించిన తెలుగు తమ్ముళ్లు బ్యాన్ చేయాలని యత్నాలు చేస్తున్నారు.
హైకోర్టులో పిల్..
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను బ్యాన్ చేయాలంటూ పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మంగళవారం నాడు ఈ పిల్‌ను స్వీకరించిన హైకోర్టు విచారించి.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ దర్శక నిర్మాతలకూ, సెన్సార్ బోర్డ్‌కు నోటీసులు జారీ చేసి నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్ట్ ఆదేశించింది.
అనంతరం ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ..
లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి వైసీపీ నేత నిర్మాతగా.. ఉన్మాది ఆర్జీవీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పార్టీ ప్రతిష్టతను దెబ్బ తీసే విధంగా ఉంది. అందుకే హైకోర్టులో పిల్ చేశాం. చిత్ర నిర్మాతలతో పాటు సెన్సార్ బోర్డుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి గురించి ఈ విధంగా చేయడం సబబు కాదు. వ్యక్తిని కించపరిచే విధంగా.. డబ్బే ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఈ కుటిల యత్నానికి బ్రేక్ పడుతుంది. న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది అని వర్మ చెప్పుకొచ్చారు.
కాగా.. తనపై ఎవరైనా కామెంట్ చేసినా నిమిషాల్లో స్పందించే ఆర్జీవీ ఇంతవరకూ ఈ వ్యవహారంపై మాట్లాడలేదు. అంతేకాదు కనీసం ట్విట్టర్లో సైతం స్పందించలేదు. అయితే ఈ పిల్‌పై హైకోర్టులో ఏమని కౌంటర్ దాఖలు చేయాలి..? ఎలా ముందుకెళ్లాలి..? అనే విషయాలపై న్యాయ నిపుణులతో నిశితంగా చర్చిస్తున్నట్లు తెలిసింది. కాగా గతంలో కూడా ఆర్జీవీపై ఇలా చాలానే కేసులు.. పిల్లు వేసిన సందర్భాలున్నాయి. అయితే ఈ పిల్ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.