కిల్లింగ్ వీరప్పన్ మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
నటీనటులు: శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, యజ్ఞ శెట్టి, పరుల్ యాదవ్, రాక్‌లైన్ వెంకటేష్ తదితరులు
సమర్పణ: శ్రీకృష్ణ క్రియేషన్స్
సంస్థలు: జి ఆర్ పిక్చర్స్ మరియు జెడ్ త్రీ ప్రొడక్షన్స్
నిర్మాతలు: బీవీ మంజునాథ్, ఇ.శివప్రకాష్, బి ఎస్ సుధీంద్ర
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వంః రామ్ గోపాల్ వర్మ.
కొందరు దర్శకులకు కొన్ని రకాల నైపుణ్యాలుంటాయి. అలాంటి దర్శకుల్లో రామ్‌గోపాల్‌వర్మకున్న నైపుణ్యం మరీ ప్రత్యేకమైనది. ఆయన నిజ జీవిత కథలను చాలా బాగా వెండితెరమీద ప్రెజెంట్ చేయగలడనే పేరు తెచ్చుకున్నాడు. శివ, గాయం, ఆ మధ్య రక్తచరిత్ర, ఇప్పుడు కిల్లింగ్ వీరప్పన్.. కొన్ని తరహా కథలను రామ్ గోపాల్ వర్మ చెబుతున్నాడంటేనే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలవుతుంది. అలాంటి ఆసక్తి వర్మ కిల్లింగ్ వీరప్పన్ మీద కూడా చాలా మందికి ఉంది. ఎందుకంటే వీరప్పన్ సామాన్యమైన వ్యక్తి కాదు. మూడు రాష్ట్రాలను దాదాపు మూడు దశాబ్దాల పాటు ముప్పతిప్పలు పెట్టిన గంధపు చెక్కల స్మగ్లర్. చివరికి పోలీసుల చేతిలో బుల్లెట్లకు ప్రాణాలు విడిచాడు. ఆయన్ని అక్టోబర్ 18నే చంపడానికి కారణమేంటి? ఈ సినిమాను చూసి వీరప్పన్ భార్య ఎందుకు ఆక్షేపించి ఉంటుంది? కన్నడ నటుడు రాజ్‌కుమార్ కిడ్నాప్ ప్రస్తావన ఇందులో ఉందా? వంటివన్నీ సగటు ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగించే అంశాలు. వాటిని చెప్పడంలో వర్మకృతకృత్యుడయ్యాడా? పదండి చూద్దాం.
కథ
తనను టార్గెట్ చేసిన పోలీసులను కక్ష్య కట్టి చంపేస్తుంటాడు వీరప్పన్. అతన్ని ముట్టుబెట్టించాలన్నదే పోలీసుల లక్ష్యం. అందుకోసం ప్రత్యేక ఫోర్సు కూడా పనిచేస్తుంటుంది. అయినా వందల మంది పోలీసులు ప్రాణాలను కోల్పోతారే తప్ప ప్రయోజనం ఉండదు. అలాంటి సమయంఆలో టాస్క్ ఫోర్స్ ఆఫీసర్‌కి ఓ ఐడియా వస్తుంది. వీరప్పన్ భార్యని టార్గెట్ చేస్తారు. ఆమెను కలుసుకోవడానికి అతను వచ్చినప్పుడు పట్టుకోవాలన్నది ప్లాన్. అయితే పోలీసుల ప్లాన్ తెలుసుకున్న వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి తనతో ఉన్న వారిని అనుమానిస్తుంది. ఆ ప్లాన్ ఫెయిల్ కావడంతో ఇంకో రెండు మూడు రకాలుగా తమ ప్రయత్నాలను సాగిస్తారు టాస్క్ ఫోర్స్ అధికారులు. మరికొన్ని సార్లు వైఫల్యాలను ఎదుర్కొంటారు. అడవిలో ఉన్నంత వరకు వీరప్పన్‌ని ఏమీ చేయలేం కాబట్టి అతన్ని అడవి నుంచి బయటకు రప్పించాలని ప్లాన్ చేస్తారు. అందులోనూ అక్టోబర్ 18నే ప్లాన్ చేస్తారు. అది ఎందుకు? ఇంతకీ అసలు వీరప్పన్ మరణానికి అంకురార్పన జరిగింది ముత్తులక్ష్మి మాటల వల్లనేనా? ఇందులో ఓ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి? తమిళ ఈలంకు వీరప్పన్‌కు ఎలాంటి సత్సంబంధాలుండేవి? వీరప్పన్ చనిపోయిన ఫోటోల్లో ఆయన మీసాలను ట్రిమ్ చేసి ఉంది. అసలు మీసాలను కత్తిరించింది పోలీసులా? ఇంకెవరు? వంటివన్నీ సెకండాఫ్ లో, మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో తేలే అంశాలు.
హైలైట్స్
వీరప్పన్ కథ అనగానే అటు తమిళనాడు వాళ్లకే కాదు, ఇటు తెలుగువారికి, అటు కన్నడిగులకు కూడా ఆసక్తికరమైన అంశమే. రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేయడం వల్ల సినిమా వాళ్ళకు కూడా ఆసక్తికరమే. ఈ సినిమాను ఒక యాంగిల్‌లో చూపించాడు వర్మ. అదీ వీరప్పన్‌ను మట్టుబెట్టించిన పోలీసుల యాంగిల్‌లో చూపించాడు. వీరప్పన్‌ను చంపేయడానికి టాస్క్ ఫోర్సు వాళ్ళు ఎన్ని రకాల ప్లాన్‌ను వేశారనేది చూపించారు. సత్యమంగళం అడవులను చూపించడం చాలా బావుంది. వీరప్పన్‌గా సందీప్ భరద్వాజ్, రాక్షసుడైన పోలీసుగా శివరాజ్‌కుమార్ జీవించారు. శివరాజ్‌కుమార్ పోలీసు పాత్రలో జీవించారు. తన తండ్రిని కిడ్నాప్ చేసిన ద్వేషం అతనిలో లోలోన ఉందేమో వీరప్పన్ పేరెత్తిన ప్రతిసారీ అతని కళ్ళల్లో ఫైర్ కనిపించింది. కొన్ని సన్నివేశాల్లో నిజంగా అతనే మట్టుబెడుతున్నంత లైవ్లీగా చేశాడు. కెమెరా పనితనం ఎక్సలెంట్. ఎక్కడా సోది లేదు. రీరికార్డింగ్ కూడా బావుంది. చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు వర్మ. రాజ్‌కుమార్ కిడ్నాప్ అయినప్పుడు వీరప్పన్ చేతికి మొత్తం డబ్బు అందలేదని, ఆ సమయంలో అతన్ని తమిళ ఈలం మోసం చేసిందనీ చెప్పాడు. ముత్తులక్ష్మిని వీరప్పన్ చేసుకున్న గాంధర్వ వివాహాన్ని గురించి కూడా ప్రస్తావించాడు. ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ దాగదన్నట్టు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక రకంగా వీరప్పన్‌ని చంపడానికి బీజం ముత్తులక్ష్మి రహస్యాన్ని బయటపెట్టడం, తన ఫ్రెండ్‌ను సాయం కోరడం వంటి వాటి నుంచే మొదలైందన్న విషయాన్ని వర్మ చెప్పకనే చెప్పాడు. అన్నిటికన్నా ముందు వీరప్పన్ కథను తనకు తెలిసిన నిజాలతో తెరకెక్కించానని ఒప్పుకున్నాడు. ఓ వైపు పోలీసులను కూడా కర్కశులుగానే చూపించినప్పటికీ, వారి ఫ్యామిలీల గురించి కూడా కొన్ని షాట్‌లలో చాలా హృద్యంగా చూపించాడు.
డ్రాబ్యాక్స్
ఈ కథలో రెండు ఏనుగులు, అక్కడక్కడా పాములు, వీరప్పన్ గన్‌తో ఉండటం వంటి వివరాలు తప్ప వీరప్పన్‌కి ఆ సత్యమంగళం అడవుల్లోని చుట్టుపక్కల గ్రామాలు ఎందుకు విశ్వాసంగా ఉండేవనే అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. పోలీసులు చుట్టుముట్టడం, విఫలమవడం చూపించారు. అవి కూడా ఏదో డాక్యుమెంటరీని తీసినట్టు ఉన్నాయి. అంతేగానీ ఎక్కడా వాస్తవాలను చూపించలేదు. వీరప్పన్ తన సొంత బిడ్డను చంపేశాడనే మాట ఇప్పటికీ వివాదాంశంగానే ఉంది. అయితే మిగిలిన ఇద్దరు కుమార్తెల సంగతి ఏంటనేది చూపించలేదు. వీరప్పన్ చనిపోవడానికి ముందు ముత్తులక్ష్మి అంత యంగ్‌గా లేదు. బహుశా సినిమాలో గ్లామర్ కోసం వర్మ ముత్తులక్ష్మి పాత్రను అంత యంగ్‌గా చూపించాడేమో. మరోవైపు ముత్తులక్ష్మి అంత విలాసంగా కూడా లేదు. కూలి పని చేసుకుంటూ తన పిల్లలను హాస్టళ్లలో ఉంచి చదివిస్తోంది. అలాంటి విషయాలు ఇందులో లేవు. కొన్నిచోట్ల రీరికార్డింగ్ ఎక్కువై విసుగుపుట్టిస్తుంది. శివరాజ్‌కుమార్‌ని చూస్తే కొన్ని షాట్‌లలో సైకోలాగా బిహేవ్ చేసినట్టు అనిపిస్తుంది.
విశ్లేషణ
వీరప్పన్ సినిమా అనగానే ఉత్సుకత ఉంటుంది. ఆ ఉత్సుకతను సినిమాలో చివరిదాకా మెయింటెయిన్ చేయగలిగాడు వర్మ. వీరప్పన్ కూడా పొగడ్తలకి పడిపోతాడనే విషయం అర్థమైంది. వీరప్పన్‌ని కలవాలంటే మూడు చెక్‌పోస్టులుండేవని తెలిసింది. రాజ్‌కుమార్ కిడ్నాప్ అయినప్పుడు వీరప్పన్ డిమాండ్ చేసిన మొత్తంలో ఎక్కువ భాగం తమిళ ఈలం వాళ్ళు నొక్కేశారని చెప్పాడు వర్మ. అసలు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అనే సంశయం వీరప్పన్‌కి అప్పటిదాకా ఎప్పుడూ లేదు. కానీ ఈ ఘటన అతనిలో ఇతరుల పట్ల అవిశ్వాసానికి తెరదీసింది. ఎల్టీటీఈ ప్రభాకరన్‌తో చేతులు కలిపి ఇటు రజనీకాంత్‌ను, అటు కంచి కామకోఠిపీఠాధిపతి జయేంద్ర సరస్వతిని కూడా కిడ్నాప్ చేయాలని, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలను తన చెప్పుచేతల్లో పెట్టుకుని అడవుల నుంచే ప్రభుత్వాలను శాసించే స్థాయికి ఎదగాలనే కోరిక వీరప్పన్‌లో బలంగా ఉండేదనీ చెప్పాడు వర్మ. ఒక రకంగా చెప్పాలంటే వీరప్పన్ హత్య వెనుక జరిగిన పెద్ద ప్లాన్‌ను విశదీకరించి, అంతే స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశాడు. చాలా వరకు కృతకృత్యుడయ్యాడు. చిన్నా చితకా లోపాలు మినహాయిస్తే తను చెప్పదలచుకున్న యాంగిల్‌ను చక్కగానే ప్రెజెంట్ చేశాడు వర్మ.
బాటమ్ లైన్: కిల్లింగ్ వీరప్పన్ మిషన్ సక్సెస్
రేటింగ్: 3/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments