ఆంధ్రోడా.. నీ తాట తియ్యనీకి వస్తున్నా: ఆర్జీవీ

  • IndiaGlitz, [Saturday,April 20 2019]

టాలీవుడు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇటీవల బయోపిక్‌ల బాట పట్టిన విషయం విదితమే. ఇప్పటికే ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టమైన లక్ష్మీపార్వతి పై 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళపై ఓ సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన ఆర్జీవీ తమిళనాట సంచలనం రేపాడు.

తాజాగా.. గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ తెరకెక్కించేందుకు సిద్దమైన ఆర్జీవీ.. ‘టైగర్ కేసీఆర్’ అనే టైటిల్‌ కూడా ఖరారు చేసేశాడు. ‘టైగర్ కేసీఆర్’ ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేస్తానని చెప్పిన వర్మ దానికి ముందే ఓ వీడియో విడుదల చేసి రచ్చరచ్చజేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆర్జీవీ సినిమాపై పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

వీడియోలో ఏముంది..!?

'మా భాషమీద నవ్వినవ్. మా ముఖాలమీద ఊసినవ్. మా బాడీల మీద నడిసినవ్.. ఆంధ్రోడా.. వస్తున్నా. వస్తున్నా.. నీ తాట తియ్యనీకి వస్తున్నా.. టైగర్ కేసీఆర్ కమింగ్ సూన్' అంటూ రాంగోపాల్ వర్మ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వర్మపై కొందరు మండిపడుతుంటే, కొందరేమో గాన గద్ద అంటూ సెటైర్లు వేస్తున్నారు.