ఆర్జీవీ మరో సంచలనం..: పవన్‌పై సినిమా!
- IndiaGlitz, [Wednesday,November 27 2019]
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంచలన చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. ఎల్లుండి అనగా.. నవంబర్ 29న రిలీజ్ చేస్తామని చిత్రబృందం చెప్పినప్పటికీ.. విడుదలపై మాత్రం అనేక అనుమానాలు వస్తున్నాయి. అసలు రిలీజ్ అవుతుందా..? కాదా..? అని ఆర్జీవీ అభిమానులు, ఔత్సాహికుల్లో టెన్షన్ మొదలైంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ ప్రకటించాడు. అయితే ఈ రెండు కూడా రిలీజ్‌కు నోచుకోలేదు కానీ.. తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడాయన.
వాస్తవానికి మెగా ఫ్యామిలీ అంటే ఆర్జీవీ అస్సలు పడదు.. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ అంటే పడదంటే పడదు. ఎందుకు పడదు..? ఎందుకు చెడింది..? అనే విషయాలు ఇక్కడ అప్రస్తుతం.. అసందర్భం కూడా. ఇప్పటికే పలుమార్లు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడటం.. సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించడం.. ఈయన తిట్టడమే కాకుండా ఇంకొందరితో తిట్టించడం కూడా చేశాడు. ఈ మధ్యనే మెగా ఫ్యామిలీపై సినిమా తీస్తున్నాని ప్రకటించి.. ఆ తర్వాత ‘మెగా ఫ్యామిలీ అనే చిత్రం 39 మంది పిల్లలున్న ఒక వ్యక్తి కథ. నేను చిన్న పిల్లల సినిమాలు తీయలేను కాబట్టి ఈ చిత్రాన్ని నేను డైరెక్ట్ చెయ్యట్లేదు’ అని తప్పుకున్నాడు. అయితే వొడ్కా మత్తులో తీస్తానని చెప్పి.. కిక్కు దిగాక కుదరదు తీయనని చెప్పారని అప్పట్లో విమర్శలూ వచ్చాయి.
పవన్‌పై సినిమా!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద సినిమా చేయాలని ఆర్జీవీ ఫిక్సయ్యాడు. ‘కమ్మరాజ్యంలో.. కడప రెడ్లు’ సినిమాకు సంబంధించి మీడియాతో మాట్లాడిన ఆయన.. సంచలన ప్రకటన చేశాడు. తన తదుపరి చిత్రం ‘మట్టి ముంతలో మజ్జిగన్నం’ అనే టైటిల్‌తో సినిమా తీస్తున్నట్టు పరోక్షంగా ప్రకటించాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి వివరాలు చెప్పాలని మీడియా మిత్రులు ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలియదంటూనే.. ఆ సినిమా తీస్తే కచ్చితంగా మీడియాకు అంకితం ఇస్తానని చెప్పుకొచ్చాడు.
‘మహా’ నాటకాలపై కూడా!
మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ఎన్నో ట్విస్ట్‌లు.. మరెన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ‘మహా వికాస్ అఘాడీ’ కూటమి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రేపు కొలువు తీరనున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో మహారాష్ట్ర రాజకీయాల మీద మరో ‘సర్కార్’ సినిమా తీసేందుకు తాజా రాజకీయాలు కథను అందించాయని వర్మ చెప్పుకొచ్చారు. ‘కడప రాజ్యంలో కమ్మ రెడ్లు’ సినిమాకు సీక్వెల్ తీస్తే.. ‘కడప రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’ అని పెడతాననన్నారు.
క్రైమ్, హారర్ కంటే పొలిటికల్ క్రైమ్ చాలా ఎక్కువగా ఉందన్నారు. అనంతరం.. ‘నాకు చిన్నప్పటి నుంచి గిల్లటం అంటే ఇష్టం.. అందుకే నేను ఇలాంటి వివాదాస్పద చిత్రాలను తీస్తుంటాను. నాకు ఎవరైనా పొగిడితే నిద్రొచ్చేస్తుంది. బాగా తిట్టించుకోవటం నాకు ఇష్టం అందుకే ఇలాంటి సినిమాలు చేస్తున్నాను’ అని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.