Rewind 2022: కలిసిరాని కాలం
- IndiaGlitz, [Friday,December 23 2022]
కాలచక్ర గమనంలో మరో సంవత్సరం కలిసిపోనుంది. 2022 మరికొద్దిరోజుల్లో పాత సంవత్సరం కానుంది. కష్టాలు, కన్నీళ్లు, ఆనందాలు, సంతోషాలు, అవార్డులు, రివార్డులు, పంతాలు, పట్టింపులు ఇలా ప్రతి ఒక్కరికి ఈ యేడు జరిగే వుంటుంది. కాని కొందిరికి మాత్రం మరిచిపోలేని తీపి, చేదు జ్ఞాపకాలు వుంటాయి. ఈ సంవత్సరం లాగా మరెప్పుడూ వుండకూడదని కోరుకుంటారు. వీరిలో ప్రముఖులు కూడా వుంటారు. మరి 2022వ సంవత్సరం సినీ రంగంలోని పలువురికి కూడా కలిసిరాలేదు. మరి వారెవ్వరో, వాళ్లకొచ్చిన కష్టమేంటో చూద్దాం.
మహేశ్ బాబు:
ఈ ఏడాది వ్యక్తిగతంగా అత్యంత దురదృష్టవంతుడు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబే. ఈయనకు ఎదురైన కష్టం బహుశా మరెవ్వరికి జరిగుండదు. ఒకే ఏడాది తన సోదరుడు రమేశ్ బాబు, తల్లి ఇందిరా దేవి, గత నెలలో తండ్రి కృష్ణను ఆయన కోల్పోయారు. నెలల వ్యవధిలో జరిగిన ఈ విషాదాలతో మహేశ్ బాబు కృంగిపోయారు.
తల్లిదండ్రుల తర్వాత మహేశ్‌కు అత్యంత ఇష్టమైన వ్యక్తి అన్నయ్య రమేశ్ బాబే. కృష్ణ సినిమాలతో బిజీగా వున్న సమయంలో మహేశ్ బాధ్యతను ఆయన తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేశ్ బాబు ఈ ఏడాది జనవరి 8న హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దురదృష్టవశాత్తూ అన్న చివరి చూపుకు కూడా మహేశ్ బాబు నోచుకోలేకపోయారు. ఆ సమయంలో మహేశ్ బాబు కోవిడ్ బారినపడటంతో ఐసోలేషన్‌లో వున్నారు. రమేశ్ మరణం మహేశ్‌తో పాటు కృష్ణను కూడా బాగా కృంగదీసింది.
రమేశ్ మరణంతో షాక్‌లో వున్న మహేశ్ బాబును తల్లి ఇందిరా దేవి మరణం మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. అనారోగ్య సమస్యలతో ఇందిరా దేవి సెప్టెంబర్ 28న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అప్పుడు కొడుకుగా తల్లి అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు మహేశ్. గత నెలలో తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ మహేశ్ బాబును ఒంటరివాడిని చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
నాగచైతన్య:
అక్కినేని వారసుడు నాగచైతన్యకు సినిమాల పరంగానూ, వ్యక్తిగతంగానూ 2022 ఏమాత్రం కలిసి రాలేదు. ఏడాది ప్రారంభంలో తండ్రితో కలిసి నటించిన బంగార్రాజుతో మంచి విజయాన్ని అందుకుని అక్కినేని అభిమానులను ఖుషీ చేశారు చైతూ.
ఆ తర్వాత అక్కినేని కుటుంబానికి మనం లాంటి మెమొరబుల్ మూవీ అందించిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ చిత్రంలో నటించారు నాగచైతన్య. ఆయన సరసన రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌లు నటించారు. ఈ సినిమా టీచర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. కేవలం ఫీల్‌గుడ్ మూవీ అని అనిపించుకుంది. రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.8.95 కోట్లను మాత్రమే రాబట్టి నష్టాలను మిగిల్చింది.
కానీ జయాపజయాలను పక్కనబెట్టి చైతూ ముందుకే వెళ్లారు. దీనిలో భాగంగా కెరీర్‌లో తొలిసారిగా పాన్ ఇండియా మూవీ ‘‘లాల్ సింగ్ చడ్దా’’లో నటించారు . బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ నటించిన ఈ మూవీలో చైతూ ఓ కీలకపాత్ర పోషించారు. కానీ ఇది కూడా ఆయనను తీవ్రంగా నిరాశ పరిచింది. చైతూ ఆమీర్ కాంబినేషన్‌లో వచ్చిన కొన్ని సీన్లు బాగానే వున్నాయి అన్న పేరు మిగిలింది తప్పించి.. కలెక్షన్ల పరంగా ఏ రికార్డులు నమోదు చేయలేదు. ఆమీర్‌ఖాన్ క్రేజ్ కూడా లాల్ సింగ్‌ను కాపాడలేకపోయింది.
సమంత:
అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు సమంత. అయినప్పటికీ మొక్కొవోని ఆత్మవిశ్వాసంతో వ్యక్తిగత ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. అంతేకాదు.. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇలా జీవితాన్ని లాగిస్తూ వుండగా సామ్ జీవితంలో మరో కుదుపు చోటు చేసుకుంది. లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో సమంతా బాధపడుతున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని తొలుత పుకార్లుగా అంతా కొట్టిపారేశారు. కానీ స్వయంగా సమంత అది నిజమేనని ‘‘మయోసైటిస్’ అనే వ్యాధి బారిన తాను పడినట్లు ఆమె ప్రకటించారు. దీంతో అభిమానులు, సినీ ప్రపంచం షాక్‌కు గురైంది. యశోదా సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ సామ్ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఏడాది చివరిలో యశోదా సినిమా విజయం సాధించడంతో సామ్ కాస్త ఊరట చెందారు.
విజయ్ దేవరకొండ:
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌తో మంచి జోరుమీదున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు ఈ ఏడాది అస్సలు కలిసిరాలేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన హీరోగా తెరకెక్కిన లైగర్ ప్రేక్షకులను నిరాశ పరిచింది. తన పాన్ ఇండియా ప్రయత్నాలు తొలి సినిమాకే బెడిసికొట్టడంతో విజయ్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. లైగర్ పరాజయం తర్వాత ఆయన ఏ పబ్లిక్ వేదికలోనూ కనిపించలేదంటే విజయ్ ఎంతగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారో అర్ధం చేసుకోవచ్చు. దీనికి తోడు లైగర్‌లో కొందరు రాజకీయ నాయకులు రహస్యంగా పెట్టుబడులు పెట్టారని, హవాలా మార్గంలో నిధులు మళ్లించారని ఈడీ అనుమానిస్తోంది. దీంతో ఇప్పటికే పూరి, చార్మీ, విజయ్ దేవరకొండలను విచారించింది .
పూనం కౌర్:
పదిహేనేళ్ల క్రితమే తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన పూనమ్ కౌర్ హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయారు. కానీ సినీ నటిగా కంటే కూడా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆమె ఎక్కువగా పాపులర్ అయ్యారు. ప్రతినిత్యం సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయాలపై పూనం కౌర్ స్పందిస్తూ వుంటారు. తాజాగా ‘‘Fibromyalgia’’ అనే వ్యాధితో తాను బాధపడుతున్నట్లు ఆమె వెల్లడించారు. అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు తీవ్రమైన కండరాల నొప్పి ఈ వ్యాధి లక్షణాలు. ప్రస్తుతం కేరళలో వున్న పూనంకౌర్‌కు అక్కడి వైద్యులు వివిధ పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారించారు. ప్రస్తుతం Fibromyalgia నుంచి కోలుకునేందుకు పూనమ్ కౌర్ శ్రమిస్తున్నారు. వ్యాయామాలు, టాకింగ్ థెరపీలే దీనికి మందులుగా వైద్యులు చెబుతున్నారు.
IndiaGlitzతో పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ఈ వ్యాధి జీవితాంతం వుంటుందని తెలిపారు. తాను పూణేకి తిరిగి వచ్చానని, రెండేళ్లుగా తనను విపరీతంగా ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. తెలుగు వారితో ప్రత్యేక అనుబంధం వున్న పూనమ్ కౌర్ ప్రస్తుతం చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఆమె కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది చేసిన నాతి చరామి సినిమా కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.