Rewind 2022: పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపిన 5 చిత్రాలివే...
- IndiaGlitz, [Friday,December 16 2022]
ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశస్తులు ఇదే నిజమని నమ్మేవారు. విస్తృతమైన మార్కెట్, భారీ బడ్జెట్ సినిమాలతో బాలీవుడ్ విస్తరించింది. అయితే ఇప్పుడు ఆ ప్రభ మసకబారుతోంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎప్పుడైతే బాహుబలితో పాన్ ఇండియా అనే ఫ్లాట్‌ఫామ్‌ని పరిచయం చేశాడో ఇక అక్కడి నుంచి దక్షిణాది సినిమాలు ముఖ్యంగా తెలుగు చిత్రాలు బాలీవుడ్‌ను దున్నేస్తున్నాయి. మన అడ్డా కాకపోయినా అక్కడ మనోళ్లు కోట్లు కొల్లగొడుతున్నారు. మనోళ్ల స్పీడుకు నార్త్‌లో స్టార్ హీరోలు సైతం భయపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఏం సినిమాలు తీయాలో, అక్కడి ఆడియన్స్‌కి ఏం తీస్తే నచ్చుతుందో అర్ధం కాక బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ ఏడాది పాన్ ఇండియా రేంజ్‌లో దుమ్మురేపిన సినిమాలేంటో చూస్తే:
ఆర్ఆర్ఆర్:
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ... టాలీవుడ్‌లో రెండు కుటుంబాల వారసులను, వారి అభిమానులను ఒక్కటి చేసింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటించిన ఈ సినిమా మార్చి 25, 2022న రిలీజై దేశవ్యాప్తంగా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.550 కోట్లతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్... ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మధ్యనే ఈ చిత్రాన్ని జపాన్‌లోనూ రిలీజ్ చేయగా.. అక్కడా మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. జపాన్‌లోని 44 నగరాల్లో 209 స్క్రీన్లలో, 31 ఐమ్యాక్స్ కేంద్రాల్లో విడుదలైన ఆర్ఆర్ఆర్ వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.
పుష్ప :
తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు పైకెక్కించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. దేశం మొత్తం పుష్ప పాటలు, డైలాగ్స్‌తో ఊగిపోయింది. ఈ మధ్యకాలంలో సమాజంపై ఈ స్థాయిలో ప్రభావం చూపిన సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తగ్గేదే లే అంటూ గడ్డం కింద చెయ్యి పెట్టి డైలాగ్ చెప్పారు. ఇది అల్లు అర్జున్‌కు తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. తొలుత ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లోనే రిలీజ్ చేయాలని భావించినప్పటికీ.. అనుకోకుండా హిందీలోనూ వదిలారు.
డిసెంబర్ 17, 2021న విడుదలైన పుష్పలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్‌గా నటించారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.400 కోట్ల వసూళ్లు సాధించి అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇటీవలే ఈ సినిమాను రష్యాలోనూ డబ్ చేసి వదిలారు. పుష్ప 2 షూటింగ్‌కు తాజాగా చిత్ర యూనిట్ కొబ్బరి కాయ కొట్టిన సంగతి తెలిసిందే.
కేజీఎఫ్ 2 :
కన్నడ చిత్ర పరిశ్రమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 1 కలెక్షన్ల వర్షం కురిపించింది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. యూత్ అయితే రాఖీ భాయ్ పాత్రలో తమను తాము ఊహించుకున్నారు. ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2ను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 18, 2022న విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 కలెక్షన్ల కుంభవృష్టిని కురిపించింది. రూ100 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.1,200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, అనేక రికార్డులు కొల్లగొట్టింది. రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి కన్నడ సినిమాగా చరిత్ర సృష్టించింది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, దంగల్ తర్వాత 1000 కోట్ల క్లబ్‌లో చేరిన నాలుగో సినిమాగా నిలిచింది. ఈ చిత్రంలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా... సంజయ్ దత్, రావు రమేశ్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్‌లు కీలక పాత్ర నటించారు.
కాంతారా :
కేజీఎఫ్ సిరీస్ తర్వాత కన్నడ సినిమాను మరో మెట్టెక్కించిన చిత్రం కాంతారా. అతి తక్కువ బడ్జెట్‌తో రిలీజైన ఈ సినిమా సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తాను మరోసారి చాటింది. అన్ని భాషల్లో కలిపి 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 30, 2022న రిలీజైన ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించారు. దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని ఆచార వ్యవహారాలు, సంస్కృతిని కాంతారా కళ్లకు కట్టింది. కిశోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమి గౌడలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
కార్తీకేయ 2 :
ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది సంచలన విజయం సాధించిన చిత్రం కార్తీకేయ 2. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా గతంలో వచ్చిన కార్తీకేయకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 13, 2022న రిలీజైంది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా హిందీ ఆడియన్స్‌కి కార్తీకేయ 2 బాగా కనెక్ట్ అయ్యింది. తొలుత హిందీలో 50 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో స్క్రీన్ల సంఖ్య 3,000కు పెరిగింది. అంతేకాదు.. బాలీవుడ్ సూపర్‌స్టార్లు అమీర్ ఖాన్ ‘‘లాల్ సింగ్ చద్దా’’, అక్షయ్ కుమార్ ‘‘రక్షాబంధన్’’లు కార్తీకేయ ముందు నిలబడలేకపోయాయి. ఈ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించగా, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్‌లు కీలకపాత్ర పోషించారు.
విక్రమ్:
టాలీవుడ్, శాండిల్‌వుడ్, మల్లూవుడ్‌ల ధాటికి కోలీవుడ్ కొంత వెనుకబడిన సంగతి తెలిసిందే. దీంతో పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటాలని తమిళులు తెగ తాపత్రాయపడిపోయారు. ఈ క్రమంలో వారి కల తీర్చింది ‘‘విక్రమ్’’. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా , లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. లేటు వయసులోనూ తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని కమల్ హాసన్ నిరూపించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్‌లు కీలకపాత్రలు పోషించగా.. చివరిలో సూర్య అతిథి పాత్రలో మెరిశారు. ఇకపోతే.. ‘‘విక్రమ్’’కు సీక్వెల్ తెరకెక్కించే పనిలో వున్నారు లోకేష్ కనగరాజ్. 2023లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం వుంది.