Revanth:పెద్దమ్మతల్లిని దర్శించుకుని ఎల్బీ స్టేడియానికి రేవంత్..
- IndiaGlitz, [Thursday,December 07 2023]
మరికాసేపట్లో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు కుటుంబసభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్నారు. మార్గమధ్యలో గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించనున్నారు. అటు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస్సుల్లో ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్నారు. ఇందుకోసం అధికారులు నాలుగు బస్సులను సిద్ధం చేశారు.
ఇక రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర నలుమూలాల నుంచి కాంగ్రెస్ ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా దరాబాద్ తరలివస్తున్నారు. దీంతో స్టేడియం చుట్టుపక్కల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మరోవైపు స్టేడియంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు.. ఆత్మీయ అతిధులుగా తెలంగాణ ఉద్యమకారులు రానున్నారు.
స్టేడియంలో ప్రధాన వేదికపై ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుండగా.. లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక.. రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో మరో వేదిక సిద్ధం చేశారు. ఇక తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్‌కి అధికారులు ఘన స్వాగతం పలకనున్నారు. వేదిక కింద అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ.. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ రెడీ చేశారు. స్టేడియంలో 30 వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేయగా.. స్టేడియం బయట లక్షలాది మంది ప్రజలు వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్‌లు కూడా ఏర్పాటు చేశారు.