Revanth Cabinet: త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ.. రేవంత్ జట్టులోకి వచ్చేదెవరు.?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. దీంతో కేబినెట్ విస్తరణ గురించి జోరుగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తమ మంతనాలు మొదలెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి టీమ్‌లో స్థానం దక్కేదెవరికి? ఏయే సామాజికవర్గాలకు ఛాన్స్ దక్కనుంది? సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారా? కొత్త వాళ్లను మంత్రి వర్గంలోకి తీసుకుంటారా? ఆ అదృష్టవంతులు ఎవరు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు కాంగ్రెస్ నేతల్లో చర్చనీయాంశమయ్యాయి. ఫలితాలు వచ్చాక వచ్చే వర్షాకాలం అసెంబ్లీ సమావేశాల్లోపు కేబినెట్‌ను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత మంత్రివర్గంలో 11మంది ఉన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం 15శాతం మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ లెక్కన సీఎంతో పాటు 17మంది మంత్రులు కేబినెట్లో ఉండాలి. ప్రస్తుతం కేబినెట్లో ముఖ్యమంత్రితో పాటు 11మంది మంత్రులే ఉన్నారు. దీంతో మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు బీసీ, ముదిరాజ్, రెడ్డి, మైనారిటీ వర్గాలకు అవకాశామివ్వాలని రేవంత్ యోచిస్తున్నారని సమాచారం.
అలాగే ప్రస్తుత మంత్రివర్గంలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చోటు దక్కలేదు. దీనిపైనా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి ఉండగా.. ఆదిలాబాద్ నుంచి ముగ్గురు పార్టీ సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్ బరిలో ఉన్నారు. మరోవైపు తొలి మంత్రివర్గంలో చోటు దక్కని సీనియర్లు ఇప్పటికే లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. గతంలో హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ముందుకెళ్తుంది. మైనార్టీ కోటాలో ఫిరోజ్ఖాన్కు మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.
అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎవరికి వారే తమకు బెర్తు ఖాయమని ధీమాగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజ్‌లకు మంత్రి పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. వెంకట్‌కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానం దగ్గర గుడ్ విల్ ఉంది. దీంతో ఆయనకు మంత్రి పదవి పక్కా అంటున్నారు. మరి ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో తెలియాంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com