Revanth Reddy:తెలంగాణ సీఎంగా రేపే రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం..

  • IndiaGlitz, [Wednesday,December 06 2023]

తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి రేపు(గురువారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవ సభ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలుస్తోంది. దీంతో స్టేడియానికి జనం భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు.

మరోవైపు మంత్రివర్గ కూర్పుపై పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మంత్రివర్గంలో 18 మంది వరకు చోటు దక్కనుంది. ఎవరికీ మంత్రి పదవి ఇవ్వాలి.. ఏయే శాఖలు ఇవ్వాలనే దానిపై మంతనాలు చేశారు. నల్గొండ నుంచి కోమటి రెడ్డి బ్రదర్స్‌తోపాటు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి దంపతులు రేసులో ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి మల్లు భట్టి విక్రమార్కతోపాటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వర్గం కూడా మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో దామోదర్ రాజనర్సింహా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ వంటి నేతలకు కేబినెట్‌లో చోటు దక్కవచ్చని తెలుస్తోంది. ఓడిపోయిన షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, మైనంపల్లి హన్మంత్ రావులకు ఎమ్మెల్సీలు ఇచ్చిన మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం.

కాగా తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. సీనియర్లందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని.. అందరూ ఓ టీమ్‌గా పనిచేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను నెరవేరుస్తారని ఆయన తెలిపారు. ప్రకటన అనంతరం ఢిల్లీకి వెళ్లిన రేవంత్.. పార్టీ పెద్దలను కలిసి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు.