Revanth Reddy:త్వరలోనే రూ.500లకే సిలిండర్‌.. ఉచిత విద్యుత్ అమలు: రేవంత్

  • IndiaGlitz, [Friday,February 02 2024]

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మూడు నెలల్లో కేసీఆర్‌ సీఎం అవుతారని కొందరు అంటున్నారని. సీఎం కాదు కదా.. మంత్రి పదవి కూడా రాదని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పునర్నిర్మాణ సభ’లో రేవంత్‌రెడ్డి పాల్గొని లోక్‌సభ ఎన్నికలకు సమర శంఖం పూరించారు. ఇంద్రవెల్లి మట్టికి గొప్పదనం ఉందని.. ఇక్కడ వేసే ప్రతి అడుగులో పోరాట పటిమ ఉందని కొనియాడారు. కొమురం భీం, రాంజీగోండ్‌ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నామన్నారు. అమరవీరుల స్తూపం సాక్షిగా కేసీఆర్‌ పాలనను అంతం చేశామని తెలిపారు. ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

1981లో ఇంద్రవెల్లిలో అడవి బిడ్డలను కాంగ్రెస్ నేతలు పొట్టనపెట్టుకున్నారని విమర్శిస్తున్నారని.. దీనిపై ఆనాడే క్షమాపణ చెప్పానని గుర్తు చేశారు. సీమాంధ్ర పాలకుల హయాంలో ఆ తప్పు జరిగిందని గుర్తుచేశారు. అప్పుడు జరిగిన తప్పులు సరిచేసేందుకే సోనియా తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను విధ్వంస రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. రూ.7లక్షల కోట్లు అప్పులు చేశారని.. కేసీఆర్‌ కుటుంబం కోసమే రాష్ట్రం వచ్చిందా? అని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజాగాయకుడు గద్దర్‌ ప్రగతి భవన్‌కు వెళ్తే గేటు బయట నిలబెట్టారని.. కేసీఆర్‌కు గద్దర్‌ ఉసురు తగిలిందన్నారు.

మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు నొప్పి ఎందుకో అర్థం కావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాలేదని.. అప్పుడే బీఆర్ఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారని చెప్పకొచ్చారు. త్వరలోనే 15వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని.. అడబిడ్డలకు రూ.500కే సిలెండర్ ఇచ్చే పథకం ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 2లక్షల పోస్టులు భర్తీ చేసే బాధ్యత తీసుకున్నామని.. ఇప్పటికే రూ.7వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలి అని రేవంత్ పిలుపునిచ్చారు.