నాగ్ ఎన్ కన్వెన్షన్ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి..!
- IndiaGlitz, [Sunday,December 18 2016]
టాలీవుడ్ హీరో నాగార్జున చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను కట్టారని తెలిసినప్పటికీ ప్రభుత్వం ఏమీ చేయకపోవడం ఏమిటి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మంత్రి వర్గంలో ఉన్న ముఖ్యమైన వాళ్లకు నాగార్జున గారికి ఉన్నఅనుబంధం ఏమిటో.. సంబంధం ఏమిటో నాకైతే తెలియదు కానీ...పేదలు కట్టుకున్న ఇళ్లను ఆక్రమించుకున్నారని, అనుమతి లేకుండా కట్టారని కూలగొట్టిన ప్రభుత్వం నాగార్జున హైటెక్ సిటీ ఎదురుగా చెరువులో అడ్డంగా గోడ కట్టి ఫంక్షన్ హాల్ నడుపుతుంటే శాసన సభలో చర్చకు వస్తే కూడా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేసారాయన.
దీంతో ప్రభుత్వం పేదల పట్ల ఏ వైఖరితో ఉందో పెద్దల పట్ల ఏ వైఖరితో ఉందో అర్ధం అవుతుంది అంటున్నారు రేవంత్ రెడ్డి. నాగార్జున ఆక్రమణలను తొలగించాల్సిందే. నాగార్జున కూడా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. కెటిఆర్ ఎక్కడ చూసినా నాగార్జునతోనే కలిసి కనిపిస్తున్నారు. ఆయన పై ఒత్తిడి లేదు అనుకుంటే తక్షణమే ఆక్రమణలు తొలిగించాలి. హరీష్ గారు చెప్పిన దాని బట్టి ఆ కబ్జాను కెటిఆరే కాపాడుతున్నారు అని తెలుస్తుంది. ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరి..కె.టి.ఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.