Revanth Reddy:తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు..!

  • IndiaGlitz, [Tuesday,December 05 2023]

తెలంగాణ కొత్త సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందని తెలుస్తోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలపై ఈ భేటీలో చర్చించారు. అనంతరం ఖర్గే నివాసం నుంచి వీరు బయటకు వచ్చారు. ఈ భేటీలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వైపే అందరూ మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని సోనియాగాంధీకి తెలపనున్నారు. ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అధికారికంగా పేరును ప్రకటించనున్నారు.

ఇప్పటికే ఢిల్లీ నుంచి డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే, కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ బయలుదేశారు. ఇక్కడికి రాగానే సాయంత్రం సీఎం అభ్యర్థి పేరు వెల్లడించనున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు 48 గంటలుగా గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలోనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారితో రేవంత్ చర్చలు జరుపుతున్నారు. రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలియడంతో ఆయనకు హోటల్‌లో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే పలువురు అధికారులు కూడా ఆయనను అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే హోటల్‌లో రేవంత్ ఉండే గది వద్ద పోలీసులు భద్రతను పెంచారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ 7(గురువారం) ఉదయం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఇద్దర డిప్యూటీ సీఎంలు, మరికొంత మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా సోమవారం రాత్రే రాజ్‌భవన్‌లో రేవంత్‌తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఏర్పాట్లు సైతం ఏర్పాట్లు చేశారు. అయితే సీనియర్ నేతలు మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వంటి నేతలు తమకు కూడా సీఎంగా అవకాశం కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో సీఎం అభ్యర్థి ప్రకటన నిలిచిపోయింది.