Asaduddin Owaisi: రేవంత్ సర్కార్ ఐదేళ్లు అధికారంలో ఉంటుంది.. అసదుద్దీన్ ఒవైసీ భరోసా..

  • IndiaGlitz, [Saturday,March 09 2024]

తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నిన్నటి వరకు బీఆర్ఎస్‌తో ఉన్న మజ్లిస్ పార్టీ కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరవుతుంది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పాతబస్తీలో మెట్రో ఫేజ్-2 విస్తరణ పనుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి.. మొండి ఘటం అని, పోరాడి అధికారం సాధించుకున్నారని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో ఉంటుందని చేసిన.. ఐదేళ్లు సీఎంగా రేవంత్ ఉంటారని వ్యాఖ్యానించారు.

రేవంత్ ప్రభుత్వాన్ని కూలుస్తామని విపక్షాలు పదే పదే ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఎవరు కూలుస్తారో చూస్తానంటూ ఘాటు విమర్శలతో కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు రేవంత్. ఈ క్రమంలోనే ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అంటే బొటాబొటి మెజార్టీతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మజ్లిస్ పార్టీ పూర్తి మద్దతు ఇవ్వనుందని క్లారిటీ వచ్చేసింది. వాస్తవంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి అప్రకటిత మిత్రపక్షంగా వ్యవహరించడం మజ్లిస్ పార్టీకి అలవాటు. ఇంతకాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌తో సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మాత్రం కేసీఆర్‌ను పట్టించుకోవడమే మానేశారు. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. సీపీఐకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మొత్తం 65 మంది మద్దతు ఉంది. మ్యాజిక్ ఫిగర్ 60 కంటే కేవలం 5 మంది మాత్రమే ఎక్కువ ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు మజ్లిస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బలం 72 అవుతుంది. దీంతో సర్కార్‌కు పూర్తి మెజార్టీ ఉంటుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా రేవంత్ రెడ్డి గాలం వేస్తు్న్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు గులాబీ ఎమ్మెల్యేలు రేవంత్‌ను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశామని వారు పైకి చెబుతున్నా.. కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకున్నారనే ప్రచారమైతే జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే కేసీఆర్ పార్టీకి చెందిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎమ్మెల్యేల బలం మరింత పెరిగి తన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పుడు మజ్లిస్ కూడా మద్దతు తెలపడంతో రేవంత్ సర్కార్ పూర్తిగా ఐదేళ్లు అధికారంలో ఉండటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.