బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చేసిన రేవంత్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి ఊహించని రీతిలో గెలుపొందిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. ‘హ్యాండ్’ ఇచ్చి.. కమలం గూటికి చేరతారని ఎన్నికల ఫలితాల అనంతరం అటు సోషల్ మీడియాలో.. ఇటు వెబ్సైట్లలో పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లుపై ఎట్టకేలకు స్పందించిన ఎంపీ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేసి ఫుల్స్టాప్ పెట్టేశారు. తన మీద నమ్మకంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ టికెట్ ఇచ్చారని.. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు. సోషల్ మీడియాలో వ్యాపారం కోసం కొందరిలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.
కేసీఆర్‌కు గుణపాఠం!
మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు పుకార్లకు చెక్ పెడుతూ.. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడారు. మినీ భారతదేశమైన మల్కాజ్‌గిరిలో తనను ప్రజలు ఆశీర్వదించారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించిన కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని రేవంత్ చెప్పుకొచ్చారు. ఇది ప్రజల గెలుపు అని.. కేసీఆర్ పాలనను ప్రశ్నించేందుకు, ఎదిరించేందుకు ప్రజలు తనకు ఒక అవకాశం ఇచ్చారన్నారు. తన గెలుపుతో ప్రజాస్వామ్యం కాపాడేందుకు ప్రజలే నడుం బిగించారన్నారు.
కేసీఆర్‌తోనే కాదు మోదీ.. షా కూడా!
"కొడంగల్‌లో కేసీఆర్, హరీష్ రావు నాపై కుట్రలు చేసి ఓడించారు. ప్రశ్నించే గొంతుక ఉండాలన్న ఉద్దేశంతోనే మల్కాజిగిరి ప్రజలు నన్ను గెలిపించారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిలబెట్టుకుంటాను. ప్రజలకు నేనిచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తాను. కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు. ఒక్క కేసీఆర్‌తోనే కాకుండా.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ విభజన రాజకీయాలను తిప్పి కొడతాం. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వల్ల గెలిచిన బీజేపీని పార్లమెంట్లో నిలువరించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో.. రేవంత్ రెడ్డి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టి 350కుపైగా ఎంపీలున్న బీజేపీని ఏ మాత్రం ప్రశ్నిస్తారో.. ఏ మేరకు గళం విప్పుతారో తెలియాలంటే లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments