డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు.. కొత్త రేషన్ కార్డులు.. కేబినెట్‌లో కీలక నిర్ణయాలు..
- IndiaGlitz, [Tuesday,March 12 2024]
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2008లో 3,500 ఎస్జీటీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వేయగా.. కొంత మంది అభ్యర్థులు పరీక్ష రాసి క్వాలిఫై అయ్యారు. అయితే ఆ నియమాకాలు చేపట్టకపోవటంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇవ్వటంతో 14 ఏళ్ల తర్వాత నియామకాలు జరగనున్నాయి.
మరోవైపు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి రాజ్‌భవన్‌కు పంపించాలని తీర్మానం చేసింది. 16 బీసీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని.. ఇక కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. రాబోయే రెండు రోజుల్లో రైతుబంధు నిధులను 93శాతానికి పైగా పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, నాణ్యతపై రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ చంద్రఘోష్ నేతృత్వంలో విచారణకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విచారణ చేపట్టి 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో చేసిన విద్యుత్ కొనుగోళ్ల అంశంపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన విచారణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మరికొన్ని కీలక నిర్ణయాలివే...
- ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు
- పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు
- మొదటి విడతలో 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇండ్లు
- మహిళ సంఘాలు చేసిన వస్తువుల బ్రాండింగ్ కోసం ORR చుట్టూ 30 ఎకరాల స్థలం
- ముదిరాజ్, యాదవ కుర్మ, లింగాయత్, పద్మశాలి, పెరక, బలిజ, రెడ్డి, వైశ్య, మాదిగ, మాదిగ ఉపకులాల, మాల, మాల ఉపకులాలు, ఏకలవ్య, బంజారా, ఆదివాసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు
- గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు
- వేసవిలో తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.