CM, Deputy CM:తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ఎంపిక దాదాపు ఖరారైంది. ఎమ్మెల్యేలందరూ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో సీఎల్పీ నివేదికను అధిష్టానానికి ఏఐసీసీ పరిశీలకులు పంపారు. ఈ నేపథ్యంలో సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఇక డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ రాత్రి రాత్రి 8:15 గంటలకు రాజ్ భవన్‌లో వీరి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. వీరితో పాటు ఐదుగరు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ ఉదయం సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకులు స్వీకరించారు. సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గేకు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానంను రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. రేవంత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో సహా ఇతర ఎమ్మెల్యేలు బలపర్చారు. ఈ తీర్మానాన్ని ఏఐసీసీ పరిశీలకులు అధిష్టానానికి పంపించారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ గవర్నర్‌ను కలిసి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను అందించారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలికారు.
కాగా ఫలితాల్లో కాంగ్రెస్‌కు మ్యాజిక్ ఫిగర్ కంటే ఐదు సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. అందుకే ముందు జాగ్రత్తగా సీఎం అభ్యర్థిని ఎంపిక చేశారు. గతంలో మెజార్టీ వచ్చినప్పటికీ వేర్వేరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో విఫలమైన అనుభవాల దృష్ట్యా అధిష్టానం అప్రమత్తమైంది. అందుకే ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వేగంగా పావులు కదిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments